అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనరసయ్య సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-06-05T09:39:40+05:30 IST

విశాఖపట్నం సర్కిల్‌-1 అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ జి.లక్ష్మీనరసయ్యను సస్పెండ్‌ చేస్తూ లేబర్‌ కమిషనర్‌ ..

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనరసయ్య సస్పెన్షన్‌

నర్సీపట్నం అధికారిణి రమ్యకు అదనపు బాధ్యతలు

నోవారిటిస్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు రుజువు

విచారణ నివేదిక పంపిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

నాలుగేళ్ల పోరాట ఫలితమన్న ఫిర్యాదీ మన్మథరావు


విశాఖపట్నం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):విశాఖపట్నం సర్కిల్‌-1 అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ జి.లక్ష్మీనరసయ్యను సస్పెండ్‌ చేస్తూ లేబర్‌ కమిషనర్‌ రేఖారాణి ఉత్తర్వులు జారీచేశారు. నర్సీపట్నం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎం.రమ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నోవారిటీస్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారని, ఫిర్యాదీని బెదిరించి, లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.


ఇదీ నేపథ్యం...

విశాఖకు చెందిన అనకాపల్లి మన్మథరావు కథనం ప్రకారం....ఆయన నోవారిటిస్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవారు. ఆ కంపెనీ మందులను రాయడానికి డాక్టర్లకు కొంత మొత్తం ఇచ్చేది. రిప్రజెంటేటివ్‌లు లక్ష్యాలు పూర్తిచేయడానికి ఆ విధంగా ఇవ్వాలని యాజమాన్యం సూచించింది. దానిని మన్మథరావు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను జూన్‌, 2016లో ఉద్యోగంలో నుంచి తీసేశారు. దానిపై ఆయన లేబర్‌ కోర్టులో కేసు వేశారు. అప్పుడు అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌-2గా కేశవ పండా ఉండేవారు. ఆయన నోవారిటిస్‌ యాజమాన్యంతో కుమ్మక్కై మన్మథరావు కోర్టుకు హాజరుకాలేదని చెప్పి కేసు కొట్టేశారు. ఈ కేసులో అనుకూలంగా తీర్పు రావాలంటే తనకు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారని మన్మథరావు తన ఫిర్యాదులో ఆరోపించారు.


ఈ మేరకు మన్మథరావు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసును విచారించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ అయిన కలెక్టర్‌ను ఆదేశిస్తూ 2018లో ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు మన్మథరావు కేసును అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌-1 లక్ష్మీనరసయ్యను విచారించాల్సిందిగా ఉత్తర్వులు వచ్చాయి. ఆయన ఈ కేసులో అనుకూలంగా తీర్పు కావాలంటే...తనకు రూ.3 లక్షల నగదు, లెనోవా లాప్‌ట్యాప్‌ ఇవ్వాలని మన్మథరావును డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించిన వాయిస్‌ రికార్డులు, ఇతర ఆధారాలు ఆయన విశాఖపట్నం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమర్పించారు.


ఈ అధికారి అక్కడితో ఆగకుండా కేసు గురించి వెళ్లినప్పుడల్లా లేబర్‌ కమిషన్‌ ఉన్నతాధికారులను, కార్మిక శాఖా మంత్రిని, ప్రజా ప్రతినిధులను దూషించారని, వాటి రికార్డింగ్‌లు కూడా ఫిర్యాదీ సమర్పించారు. ఆయన తీరుపై విచారణ చేసిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆరోపణలన్నీ నిజమేనని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక పంపారు. అయితే ఏం జరిగిందో కానీ నెలలు గడిచిపోతున్నా...చర్యలు చేపట్టలేదు. దాంతో ఫిర్యాదీ మన్మథరావు నేరుగా లేబర్‌ కమిషనర్‌ రేఖారాణిని కలిసి అన్ని విషయాలు వివరించి, ఆధారాలు సమర్పించారు. వెంటనే ఆమె జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికను పరిశీలించి అక్కడికక్కడే అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనరసయ్యను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 


ఇదిలావుండగా మన్మథరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, లేబర్‌ ఆఫీసులో నరేశ్‌ అనే సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీనరసయ్యకు లంచాలు వసూలు చేసే దళారీగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఆయన్ను ఏడాది క్రితం శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేస్తే కేవలం పది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యాడని, బయోమెట్రిక్‌ ద్వారా ఆ విషయం తెలిసిందన్నారు. ఇక్కడి అధికారులు అతడికి సహకరిస్తున్నారని, అంతా కలిసి విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2020-06-05T09:39:40+05:30 IST