ప్రైవేట్‌ టీచర్లకు సహాయం

ABN , First Publish Date - 2021-04-22T06:36:10+05:30 IST

ప్రైవేట్‌ స్కూళ్ళను తిరిగి ప్రారంభించే వరకు ప్రతి టీచర్‌కు నెలకు 2వేల రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని పంపి ణీ చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

ప్రైవేట్‌ టీచర్లకు సహాయం
ప్రైవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక

నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం పంపిణీ 

మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌21: ప్రైవేట్‌ స్కూళ్ళను తిరిగి ప్రారంభించే వరకు ప్రతి టీచర్‌కు నెలకు 2వేల రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని పంపి ణీ చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. బుధవారం నగరంలో మంత్రి, కలెక్టర్‌ కె.శశాంక, మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రైవేట్‌ టీచర్లకు కరోనా సా యం కింద నెలకు రూ.2వేల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడంతో ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులను ఆదుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 45  వేల మంది ఉద్యోగులున్నట్లు అంచనా వేశామని, ఇప్పటి వరకు లక్షా 13వేల సిబ్బంది నమోదు చేసుకోవడంతో వారి ఖాతాల్లో 2వేల రూపాయలను జమచేశామన్నారు. వారందరికీ ఈ రోజు నుంచి బియ్యం పంపిణీ కూడా చేస్తున్నామని చెప్పారు. యూడైస్‌లో లేని విద్యా సంస్థల సిబ్బందికూడా తమకు సహాయం కావాలని కోరుతున్నారని, వారికి కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి గంగుల ప్రకటించారు. 

జిల్లాలో ఇప్పటి వరకు 3027 మంది ఉద్యోగులను గుర్తించి వారికి 2వేల రూపాయలను అందజేశామని, 441 రేషన్‌ దుకాణాల ద్వారా 76 మె ట్రిక్‌ టన్నుల బియ్యంను పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T06:36:10+05:30 IST