అమ్మకానికి అసైన్డ్‌ భూములు!

ABN , First Publish Date - 2022-06-27T04:42:15+05:30 IST

క్రయవిక్రయాలకు అవకాశం లేని అసైన్డ్‌ భూములను

అమ్మకానికి అసైన్డ్‌ భూములు!
చెర్లపటేల్‌గూడలో ఎస్సీలకు చెందిన అసైన్డ్‌ భూములు

  • కన్నేసిన రియల్టర్లు
  • తక్కువ ధరకు కొనుగోలుకు ప్రయత్నం
  • కొందరు స్థానికుల సహాయంతో విక్రయాలు
  • గుట్టుచప్పుడు కాకుండా రైతులకు అడ్వాన్సులు
  • భూములు అమ్మినా.. కొన్నా చర్యలు : అధికారులు 


క్రయవిక్రయాలకు అవకాశం లేని అసైన్డ్‌ భూములను కొనేందుకు కొందరు రిలయల్టర్లు ప్రయత్నిస్తున్నారు. అసైన్డ్‌ భూములను రియల్టర్లకు విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసైన్డ్‌ భూములను కొన్నా రిజిస్ర్టేషన్లు చేసుకోవడం కష్టమని తెలిసినా భూముల కొనుగోలుకు రైతులకు రియల్టర్లు అడ్వాన్సులు ఇచ్చారని తెలుస్తోంది. అసైన్డ్‌ భూములు క్రయవిక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటామని ఓ వైపు అధికారులు చెబుతున్నారు. 


ఇబ్రహీంపట్నం/యాచారం, 26 : జిల్లాలో ఎక్కడ చూసినా భూముల ధర ఎకరా కోట్ల రూపాయలలో పలుకుతుంది. గతంతో పోలిస్తే పెట్టుబడిదారులు ఇతర రంగాలను కాదని చాలావరకు భూముల కొనుగోళ్లపైనే దృష్టి సారిస్తున్నారు. కొందరు రియల్టర్లు, పెట్టుబడిదారులు తక్కువధరలకు భూములు కొని ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయాలనే కాంక్షతో అసైన్డ్‌ భూములపై కన్నేశారు. ఇవి కొనడానికి, అమ్మడానికి వీల్లేదని చట్టం చెప్తున్నా అడ్డదారులను వెతుకుతూ భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌గూడ రెవెన్యూలో సుమారు 60ఏళ్ల క్రితం భూములులేని నిరుపేదలకు సర్వే నెం.710లో 83ఎకరాలు 70మందికి ఎకరా, ఎకరంన్నర చొప్పున అసైన్‌మెంట్‌ పట్టాలిచ్చారు. వీరిలో 90శాతం మంది ఎస్సీ లబ్ధిదారులు కాగా. పదిశాతం ఇతర వర్గాలున్నారు. వీరిలో కొందరు ఈ భూములను సాగు చేసుకుంటుండగా మరిన్ని భూములు సాగుకు దూరంగా ఉన్నాయి. కాగా మార్కెట్లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ఏదైతేనేం అనుకున్నారేమో గ్రామానికి చెందిన కొందరు బ్రోకర్లు నగరానికి చెందిన ఓ పెట్టుబడిదారును రంగంలోకి దించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఈ భూములను అమ్మకానికి పెట్టారు. ఎకరా రూ.15లక్షల చొప్పున విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని టోకెన్‌ బయానాగా సగం మందికి దాదాపు 40మందికి రూ.40వేల నుంచి రూ.50వేల చొప్పున ఇప్పించినట్లు తెలిసింది. ఆ నోటా ఈ నోటా వ్యవహారం కాస్తా రెవెన్యూ అధికారుల వరకు వెళ్లడంతో కొంతకాలం వేచిచూసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఆర్డీవో వెంకటాచారిని వివరణ కోరగా ఇది తమ దృష్టికి రాలేదని చెప్పారు.


యాచారంలో..

యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో కొంత మంది రియల్టర్లు గతంలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను తక్కువ ధరలకు కొంటున్నారు. ఎకరా భూమికి రూ.17లక్షలకు కొంటామని, ముందు రైతులకు రూ.10వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లు గ్రామంలో వదంతులు వ్యాపించాయి. తాము అసైన్డ్‌ భూములు కొంటున్న విషయాన్ని భూమి అమ్మే వారికి తప్ప ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. మొండికేసిన రైతులను ఏదోరకంగా దారికి తెచ్చుకుంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మొండిగౌరెల్లిలో సర్వే నెం.19లో 575 ఎకరాల 30గుంటలు, సర్వే నెంబర్‌ 68లో 625ఎకరాల 20గుంటలు, సర్వేనెంబర్‌ 127లో 122ఎకరాల 22గుంటల భూమిపై నగరానికి చెందిన రియల్టర్ల కన్నుపడింది. ఈ భూములను రియల్టర్లకు విక్రయించడానికి గ్రామానికి చెందిన కొందరు పలుకుబడి గల వ్యక్తులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఈభూముల క్రయవిక్రయాలపై ఇటీవల జరిగిన గ్రామసభలో కూడా చర్చ జరిగింది. ఈ భూములు క్రయవిక్రయాలు జరగకుండా తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదేవిషయమై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి వివరాలు సేకరించారు. దీంతో కొన్నిరోజులుగా రియల్లర్లు స్తబ్దుగా ఉన్నారు. మళ్లీ పది రోజులుగా రియల్టర్లతో పాటు గ్రామానికి చెందిన పలుకుబడి గల వ్యక్తులు గోప్యంగా రైతులను కలిసి అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.


అసైన్డ్డ్‌ భూములు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు

అసైన్డ్‌భూములు అమ్మినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతేగాక పీవోటీ కింద ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. క్రయ విక్రయాలకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీన్ని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తప్పవు. 

- సుచరిత, యాచారం తహసీల్దారు 



Updated Date - 2022-06-27T04:42:15+05:30 IST