Mamata Banerjee : చిక్కుల్లో 19 మంది టీఎంసీ కీలక నేతలు!

ABN , First Publish Date - 2022-08-09T22:37:38+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata

Mamata Banerjee : చిక్కుల్లో 19 మంది టీఎంసీ కీలక నేతలు!

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) తీరు మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), బీజేపీలపై గతంలో తీవ్రంగా విరుచుకుపడేవారని, ఇటీవల ఆమె నరేంద్ర మోదీతో సమావేశమై చాలా సన్నిహితంగా మెలిగారని అంటున్నాయి. ఆమె తీరులో మార్పు రావడానికి కారణం ఆమె నేతృత్వంలోని మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అవినీతి తాండవించడమేనని, కేంద్ర దర్యాప్తు సంస్థల పట్ల ఉన్న భయమేనని ఎద్దేవా చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలాన్నిచ్చేవిధంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ఉంది. 


మన దేశంలోని రాజకీయ నేతల సంపద, విద్యార్హతలు, క్రిమినల్ కేసుల గురించి అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ ఆరా తీసి, విశ్లేషిస్తుంది. ఈ వివరాలన్నిటినీ Myneta.info వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC)లో 19 మంది ముఖ్య నేతల ఆస్తులు ఐదేళ్ళలో బాగా పెరిగాయి. దీంతో వారిపై అవినీతి ఆరోపణలు రావడం తథ్యం. అందుకే ఆమె ప్రధాని మోదీతో ఢీకొట్టే కన్నా సఖ్యతతో మెలగడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడానికి బలం చేకూరుతోంది. 


ఐదేళ్ళలో ఆస్తులు బాగా పెరిగిన టీఎంసీ నేతల వివరాలు ఏమిటంటే...

పట్టణాభివృద్ధి, మునిసిపల్ వ్యవహారాల మంత్రి ఫిర్హాద్ హకీం ఆస్తుల విలువ 2011లో రూ.3.77 కోట్లు కాగా, ఐదేళ్ళ అనంతరం రూ.6.05 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో అప్పులు రూ.54 లక్షలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. 


బిధాన్ నగర్ మాజీ మేయర్ సబ్యసాచి దత్తా 2011లో రాజర్హాట్ న్యూటౌన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో ఆయన ప్రకటించిన వివరాల ప్రకారం ఆయన ఆస్తులు రూ.43.55 లక్షలు, అప్పులు లేవు. 2016లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.2.35 కోట్లు అని, అప్పులు రూ.7.88 లక్షలు అని తెలిపారు. 


మాజీ మంత్రి అబ్దుర్ రెజ్జక్ మొల్లాకు 2011లో రూ.60.27 లక్షల విలువైన ఆస్తులు ఉండేవి, ఐదేళ్ళ అనంతరం తనకు రూ.1.13 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. అప్పులు లేవని వెల్లడించారు. 


విపత్తు నిర్వహణ మంత్రి జావేద్ అహ్మద్ ఖాన్‌కు 2011లో రూ.2.16 కోట్ల ఆస్తి ఉండేది, అప్పులు లేవు. అయితే 2016లో ఆయన ఆస్తి విలువ రూ.17.29 కోట్లకు పెరిగింది. 


ఎమ్మెల్యే స్వర్ణ కమల్ సాహా ఆస్తుల విలువ 2011లో రూ.2.55 కోట్లు కాగా, 2016లో రూ.6.69 కోట్లకు పెరిగింది. తనకు అప్పులు లేవని ఆయన వెల్లడించారు.


2011లో ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్ ఆస్తులు రూ.7.09 కోట్లు కాగా, 2016లో రూ.10.10 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో అప్పులు రూ.41.65 లక్షల నుంచి రూ.51 లక్షలకు పెరిగాయి. 


మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీకి 2011లో రూ.55.18 లక్షల విలువైన ఆస్తి ఉండేది, అది 2016నాటికి రూ.78.28 లక్షలకు పెరిగింది. 


సహకార శాఖ మంత్రి అరూప్ రాయ్ ఆస్తుల విలువ 2011లో రూ.1.17 కోట్లు కాగా, 2016లో వీటి విలువ రూ.2.73 కోట్లకు పెరిగింది. 


శాసన సభ సభాపతి బిమన్ బెనర్జీ ఆస్తుల విలువ 2011-2016 మధ్య కాలంలో రూ.1.71 కోట్ల నుంచి రూ.1.77 కోట్లకు పెరిగింది. 


2011లో భట్పర నుంచి పోటీ చేసిన అర్జున్ సింగ్‌కు అప్పట్లో రూ.36.47 లక్షల ఆస్తి ఉండేది, 2016నాటికి అది రూ.48.70 లక్షలకు పెరిగింది. సిలిగురి మేయర్ గౌతమ్ దేబ్ 2011లో ప్రకటించిన వివరాల ప్రకారం రూ.85.44 లక్షల ఆస్తి ఉండేది. అప్పట్లో ఆయన డబ్‌గ్రామ్-ఫూల్‌బరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో ఆయన ఆస్తులు రూ.1.17 కోట్లకు పెరిగాయి. 


కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ ఆస్తులు 2011 నుంచి 2016నాటికి రూ.4.79 కోట్ల నుంచి రూ.6.72 కోట్లకు పెరిగాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ఆస్తుల విలువ 2011 నుంచి 2016నాటికి రూ.80.26 లక్షల నుంచి రూ.1.51 కోట్లకు పెరిగింది. 


మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆస్తులు 2011లో రూ.7.08 కోట్లు కాగా, 2016లో రూ.11.74 కోట్లు. కోల్‌కతా మాజీ మేయర్ సుబ్రత ముఖర్జీ ఆస్తుల విలువ 2011లో రూ.55.43 లక్షలు కాగా, 2016లో రూ.94.78 లక్షలు. 


మాజీ మంత్రి సాధన్ పాండేకు 2011లో రూ.2.33 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవి. వీటి విలువ 2016నాటికి రూ.4.25 కోట్లకు పెరిగింది. ఎమ్మెల్యే షియులి సాహా ఆస్తుల విలువ 2011లో రూ.74.18 లక్షలు కాగా, 2016లో రూ.1.88 కోట్లు.


ఉన్నత విద్యా శాఖ మంత్రి బ్రత్య బసుకు 2011లో రూ.73.09 లక్షల ఆస్తులు ఉండేవి, 2016లో వీటి విలువ రూ.1.95 కోట్లకు పెరిగింది. న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘాతక్ ఆస్తుల విలువ 2011లో రూ.61.64 లక్షలు కాగా, 2016లో రూ.88.09 లక్షలు. 


‘ఎందుకు కలిశారో చెప్పాలి’

టీఎంసీ అగ్ర నేతల్లో ఒకరైన పార్థ ఛటర్జీని ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఎం మమత బెనర్జీపై విరుచుకుపడుతున్నాయి. బీజేపీని మచ్చిక చేసుకుని, అవినీతి కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కాషాయ శిబిరానికి (బీజేపీకి) ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని  కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ-మమత భేటీ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని సీపీఎం ఆరోపించింది. అవినీతి కేసుల్లో టీఎంసీ సీనియర్ నేతలు అరెస్టవుతున్న సమయంలో మోదీని ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేసింది. టీఎంసీ, బీజేపీ మధ్య పైకి కనిపించని అవగాహన ఉందని ఆరోపించింది. 


‘నిరాధార ఆరోపణలు’

టీఎంసీ స్పందిస్తూ, ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేసింది. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కలవడంలో తప్పు ఏం ఉందని ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థ ఈ విధంగానే పని చేస్తుందని తెలిపింది. బీజేపీని, దాని విధానాలను వ్యతిరేకించే విషయంలో సీపీఎం, కాంగ్రెస్ నుంచి పాఠాలను నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2022-08-09T22:37:38+05:30 IST