చివరి దశకు..నేటితో ముగియనున్న ఆస్తుల సర్వే

ABN , First Publish Date - 2020-10-20T06:27:19+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల సర్వే ముగింపు దశకు చేరుకుంది. ఆస్తుల సర్వే నమోదుకు నేటితో గడువు ముగియనుంది

చివరి దశకు..నేటితో ముగియనున్న ఆస్తుల సర్వే

గ్రామాల్లో 93.45 శాతం..

పట్టణాల్లో 88.89 శాతం

రోజూ పర్యవేక్షించిన కలెక్టర్‌, డీపీవో 

క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారుల తనిఖీలతో సర్వేలో వేగం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల సర్వే ముగింపు దశకు చేరుకుంది. ఆస్తుల సర్వే నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ప్రారంభంలో మందకొడిగా కొనసాగిన సర్వే.. పది రోజులుగా వేగంగా కొనసాగింది. ఆదివారం రాత్రివరకు జిల్లాలోని పంచాయతీల్లో 94.45 శాతం ఆస్తుల సర్వే పూర్తి చేసి వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో 88.89 శాతం ఆన్‌లైన్‌ చేశారు. ప్రారంభంలో సర్వే నమోదులో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం, సిబ్బందికి సరైన శిక్షణ లేని కారణంగా వివరాలు సేకరించడంలో జాప్యం చోటు చేసుకుంది. తరచుగా సర్వర్‌ మోరాయించడం, సిగ్నల్స్‌ సమస్య ఏర్పడడంతో రోజూ నిర్ణయించిన లక్ష్యం మేరకు సర్వే చేయలేకపోయారు. ఈనెల 10వ తేదీలోగా ఇంటింటి సర్వే ముగించాలని భావించినా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు.


ఆస్తుల నమోదుకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారంతో ముగియనుంది. జిల్లాలోని 18 మండలాల్లోని 566 గ్రామపంచాయతీల్లో ఇ-పంచాయత్‌ రికార్డుల ప్రకారం 2,18,445 ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా, ఆదివారం రాత్రి వరకు జిల్లాలో 2,04,136 ఆస్తుల వివరాలను తెలంగాణ స్టేట్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ బుక్‌ (టీఎస్‌ఎన్‌పీబీ) యాప్‌లో నమోదు చేశారు. గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న ఆస్తుల సర్వేలో 641 మంది పాల్గొన్నారు. 


ఇదిలాఉంటే, గ్రామ పంచాయతీలతో పోలిస్తే మునిసిపాలిటీల్లో సర్వే 88.89శాతం జరిగింది. వికారాబాద్‌ మునిసిపాలిటీలో 90శాతం పూర్తి కాగా, తాండూరులో 87 శాతం, పరిగిలో 93 శాతం, కొడంగల్‌ మునిసిపాలిటీలో 96శాతం పూర్తి చేశారు. వికారాబాద్‌ మునిసిపాలిటీలో 14,440 ఇళ్లు, భవనాలు ఉండగా, 12706 ఆస్తుల సమాచారం ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేశారు. తాండూరు మునిసిపల్‌ పరిధిలో 12,636 వ్యవసాయేతర ఆస్తులు ఉండగా, వాటిలో 10,802 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. పరిగి మునిసిపల్‌ పరిధిలో 5,505 వ్యవసాయేతర ఆస్తులు ఉండగా, వాటిలో 5,158 ఆస్తుల వివరాలను యాప్‌లో పొందుపరిచారు. కొడంగల్‌ మునిసిపాలిటీ  పరిధిలో 3,827 ఆస్తులు ఉండగా, వాటిలో 3,700 ఆస్తుల సమాచారం ఆన్‌లైన్‌ చేశారు. తాండూరులో 1,832, పరిగిలో 347, వికారాబాద్‌లో 1,832, కొడంగల్‌లో 187 ఆస్తుల వివరాలను సేకరించే పనిలో మునిసిపల్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు.


ఈ ఆస్తుల్లో చాలావరకు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మృతి చెందిన ఇళ్ల యజమానుల వారసుల పేరిట ఆస్తులు బదిలీ చేసుకోకపోవడం, కొనుగోలు చేసిన భవనాలను తమ పేరిట మార్పిడి చేసుకోకపోవడం, అనుమతి లేని భవనాలు ఉండడం, యజమానులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి సమస్యలు నెలకొన్నాయి. కొందరు ఇళ్లు, భవనాలు కొనుగోలు చేసి తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా... మునిసిపాలిటీలు, పంచాయతీ రికార్డుల్లో మార్చుకోలేని కారణంగా ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ కల్పించి పై సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూడా ఆన్‌లైన్‌ చేసేలా అవకాశం ఇస్తేనే ఈ ఆస్తులు కూడా ఆన్‌లైన్‌ కానున్నాయి. లేదంటే కొన్ని ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌ కాకుండానే ఉండిపోయే పరిస్థితి ఏర్పడనుంది.


కలెక్టర్‌ చొరవతో పుంజుకున్న వేగం

 వికారాబాద్‌ జిల్లాలో 20రోజుల కిందట అంతంత మాత్రంగానే ఉన్న సర్వే.. వేగవంతం చేసే దిశగా కలెక్టర్‌ పౌసుమి, జిల్లా పంచాయతీఅధికారి షేక్‌ రిజ్వానా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 15 రోజులపాటు కలెక్టర్‌ పౌసుమిబసు రోజూ మునిసిపాలిటీలు, గ్రామాల్లో పర్యటించి సర్వే ప్రక్రియ వేగం పెంచేందుకు అనుసరించాల్సిన విధానం గురించి సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయతీరాజ్‌ జాయింట్‌ కమిషనర్‌ జాన్‌వెస్లీ కూడా జిల్లాల్లో పర్యటించారు.

Updated Date - 2020-10-20T06:27:19+05:30 IST