ఆస్తుల నమోదు వేగిరం

ABN , First Publish Date - 2020-10-13T06:02:13+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ఉమ్మడి

ఆస్తుల నమోదు వేగిరం

66.90 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వనపర్తి జిల్లా


ఆంధ్రజ్యోతి, వనపర్తి : వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేగవంతం అయ్యింది. ఈ నెల 20 వరకు నమోదు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున అధికారులు ఆ మేరకు విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఈ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం మెరూన్‌ కలర్‌ పాసు పుస్తకాలు ఇవ్వనుంది. ప్రక్రియలో రాష్ట్రంలోనే వనపర్తి ముందంజలో ఉండగా, నాగర్‌కర్నూల్‌ ఉమ్మడి ఐదు జిల్లాలో చివరన నిలిచింది.


ఆస్తుల నమోదులో ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో చురుకుగా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు కూడా శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఇప్పటికే 66.90 శాతం వివరాల నమోదుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 14 మండలాలు, ఐదు మునిసిపాలిటీలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆస్తుల నమోదు కోసం 414 మంది సిబ్బందిని కేటాయించారు. జిల్లాలో 1,16,090 ఆస్తులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 77,661 ఆస్తులకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. ఆదివారం ఒక్క రోజే 4,273 వివరాలను నమోదు చేశారు.


ద్వితీయ స్థానంలో జోగుళాంబ

ద్వితీయ స్థానంలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 60.16 శాతం ఆస్తుల నమోదు పూర్తయ్యింది. ఈ జిల్లాలో 12 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,40,792 ఆస్తులు ఉండగా, ఇప్పటి వరకు 84,698 ఆస్తుల వివరాలను నమోదు చేశారు. ఆదివారం 4,092 ఆస్తులను ఎంట్రీ చేశారు.


11వ స్థానంలో మహబూబ్‌నగర్‌

11వ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో 53.02 శాతం ఆస్తుల నమోదు పూర్తయ్యింది. జిల్లాలో 14 మండలాలు, 440 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆస్తుల నమోదుకు 551 మంది సిబ్బందిని కేటాయించారు. 1,81,769 ఆస్తులకుగాను వారు 96,375 ఆస్తుల నమోదును పూర్తి చేశారు. 


15వ స్థానంలో నారాయణపేట

15వ స్థానంలో ఉన్న నారాయణపేట జిల్లాలో 51 శాతం ఆస్తుల నమోదు పూర్తయ్యింది. ఈ జిల్లాలో 11 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 350 మంది సిబ్బందిని ఆస్తుల నమోదు కోసం కేటాయించారు. 1,28,132 ఆస్తులకుగాను ఇప్పటి వరకు 64,747 ఆస్తుల నమోదును పూర్తి చేశారు.


21వ స్థానంలో నాగర్‌కర్నూల్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి స్థానంలో, రాష్ట్రంలో 21వ స్థానంలో ఉన్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 46.34 శాతం మాత్రమే ఆస్తుల నమోదు పూర్తయ్యింది. జిల్లాలో 20 మండలాలు, 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆస్తుల నమోదు కోసం 705 మంది సిబ్బందిని కేటాయించారు. 2,10,004 ఆస్తులకు గాను, 97,323 ఆస్తుల నమోదును పూర్తి చేశారు. 


త్వరితగతిన పూర్తి చేస్తాం

ఆస్తుల నమోదు విషయంలో రాష్ట్రంలో వనపర్తి జిల్లా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉంది. వివరాల నమోదు కోసం కేటాయించిన అధికారులంతా సీరియస్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలో అందరికంటే ముందుగా ప్రక్రియను పూర్తి చేసి, మొదటి స్థానాన్ని నిలబె ట్టుకుంటాం. ఆస్తుల యజమానులు కూడా అధికారులు అడిగిన వివరాలను స్వచ్ఛం దంగా ఇవ్వాలి. అధికారులు వచ్చే సరికి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచు కోవాలి.

- షేక్‌ యాస్మిన్‌ బాష, కలెక్టర్‌ వనపర్తి 

Updated Date - 2020-10-13T06:02:13+05:30 IST