ధరణిలోకి 76.96 లక్షల ఆస్తులు!

ABN , First Publish Date - 2020-10-20T08:26:22+05:30 IST

క్షేత్రస్థాయి ఇబ్బందులు, వెంటాడుతున్న సమస్యల మధ్య ధరణిలోకి 76.96 లక్షల ఆస్తులు (ఇళ్లు) చేరాయి. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో ...

ధరణిలోకి 76.96 లక్షల ఆస్తులు!

  • 12 మునిసిపాలిటీల్లో 100 శాతం నమోదు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం అంతంతే

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయి ఇబ్బందులు, వెంటాడుతున్న సమస్యల మధ్య ధరణిలోకి 76.96 లక్షల ఆస్తులు (ఇళ్లు) చేరాయి. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో నమోదు వేగంగా జరుగుతుండగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో కార్యక్రమం నిలిచిపోయింది. రాష్ట్రంలోని 12 పురపాలక సంఘాల్లో మాత్రం గుర్తించిన ఇళ్లలో వంద శాతం పూర్తయింది. ఇందులో పాల్వంచ, ఇల్లెందు, లక్సెట్టిపేట, తూప్రాన్‌, జవహర్‌నగర్‌, పోచారం, చిట్యాల, నందికొండ, కోస్గి, రామగుండం, కొడంగల్‌, వర్ధన్నపేట ఉన్నాయి. గజ్వేల్‌, భూపాలపల్లి, అచ్చంపేట, నేరేడుచర్లలో కూడా ఆస్తుల సేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది.


 ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం... ప్రస్తుతం పురపాలక సంఘాల్లో 20.77 లక్షల ఆస్తులు, గ్రామ పంచాయతీల్లో సుమారు 62.58 లక్షల ఆస్తులున్నాయి. ఇందులో పురపాలక సంఘాల్లో 16.11 లక్షల ఆస్తులు, గ్రామ పంచాయతీల్లో 56.04 లక్షల ఆస్తులు సోమవారం సాయంత్రానికి ధరణిలోకి ఎక్కాయి. అయితే కొత్త ఆస్తుల (ఇళ్లు) గుర్తింపు కొనసాగుతోంది. కాగా.. యాజమాన్య హక్కుకు భద్రత, స్థిరాస్థి లావాదేవీల్లో పారదర్శకతకు తోడు రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌ క్షణాల్లో జరిగే స్వేచ్ఛా వ్యవస్థకు వేదిక కాబోతున్న ధరణిని సీఎం కేసీఆర్‌ దసరా రోజు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకోని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.


పీటీఐ నెంబరు ఇపుడే కాదు

ఏడాది రెండేళ్ల కింద వచ్చిన ఇళ్లకు ఆస్తిపన్ను చెల్లింపు మొదలు కాలేదు. దీనివల్ల ఈ ఇళ్లకు, ఫ్లాట్లకు ఆస్తి పన్ను చెల్లింపు నెంబరు (పీటీఐ నెంబరు) రాలేదు. ధరణిలో చేరడానికి పీటీఐ నెంబరు తప్పనిసరి. వెబ్‌సైట్‌లో ఈ నెంబరు ఎంటర్‌ చేసినపుడే ఆస్తికి సంబంధించిన వివరం కనిపిస్తుంది. ఈ నెంబరే లేకపోవడంతో అలాంటి ఇళ్లు, ఫ్లాట్లు ధరణిలోకి చేరడంలేదు. ఆస్తిపన్నును చెల్లించి నెంబరు తీసుకోవాలని అనుకున్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ అవకాశాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. మరోవైపు వారసత్వంగా వచ్చిన ఆస్తులతోపాటు కొత్తగా ఇళ్లు కొన్నవారు కూడా చాలా మంది తమ పేర్ల మీద ఆస్తి బదలాయించడానికి మ్యుటేషన్‌ చేసుకోలేదు. దీనివల్ల కూడా ధరణిలో చేరే అవకాశం లేకుండా పోయింది. ఇపుడు మ్యుటేషన్‌ చేసుకోవాలనుకున్నా అందుకు అనుమతించడం లేదు. ప్రస్తుతం ఇంటి యజమాని ఏ సమాచారమిస్తే నవీకరణ తరువాత కూడా అదే ఉండనుంది.

Updated Date - 2020-10-20T08:26:22+05:30 IST