అమరావతి: అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మంత్రి పేర్ని సభలో నిద్ర పోయారు. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లుపై సభలో బుగ్గన ప్రకటన చేస్తుండగా పేర్ని నాని తన సీట్లో కూర్చొని కునుకు తీయడం చర్చనీయాంశమైంది.
కాగా ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 3 రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. ‘‘కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేశాం. రాజధానిపై మా నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారు. వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టాం. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతాము.’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.