ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-08T15:11:15+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్ర వారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ మేరకు సభాపతి అప్పావు నిరవధికం గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త యేడాదికి సంబంధించిన తొలి శాసనసభ సమావేశాలు చేపాక్‌ కలైవాన

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

                        - 16 ముసాయిదా చట్టాల ఆమోదం


చెన్నై: రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్ర వారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ మేరకు సభాపతి అప్పావు నిరవధికం గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త యేడాదికి సంబంధించిన తొలి శాసనసభ సమావేశాలు చేపాక్‌ కలైవానర్‌ అరంగం హాలులో గత బుధ వారం ఉదయం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం సభా వ్యవహారాల మండలి సమావేశమై రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమవుతున్న కారణంగా ఈ సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ప్రసంగంతో తొలి రోజు సమావేశం ముగిసింది. గురువారం శాసనసభలో రాష్ట్ర మాజీ గవర్నర్‌ రోశయ్య, కున్నూరు వద్ద హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సహా 14 మంది మృతికి సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల సమయాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగించారు. ఇక శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత గవర్నర్‌ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు చర్చల సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సీఎం స్టాలిన్‌ బదులిచ్చారు. అదే సమయంలో ఈ సమావేశాల్లో తాంబరం, కాంచీపురం, కడలూరు, శివకాశి, కరూరు, కుంభకోణం పురపాలక సంఘాలను కార్పోరేషన్‌ స్థాయికి పెంచే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇదే విధంగా టీఎన్‌పీసీసీ పరీక్షల సవరణ చట్టం, సహకార సంఘాల సవరణ చట్టం ఇలా 16 రకాల బిల్లుల ను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే రెండుసార్లు వాకౌట్‌ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ తొలి రోజు గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఆ పార్టీ శాసన సభ్యులు వాకౌట్‌ చేశారు. అదే సమయంలో డీఎంకే మిత్రపక్షమైన డీపీఐ సభ్యులు నీట్‌ రద్దు ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపని గవర్నర్‌ తీరుకు నిరసగా వాకౌట్‌ చేశారు. ఇక శుక్రవారం ఉదయం శాసనసభలో సహకార సంఘాల సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్‌ చేశారు. 

Updated Date - 2022-01-08T15:11:15+05:30 IST