నేటి నుంచి అసెంబ్లీ

ABN , First Publish Date - 2022-03-07T08:27:39+05:30 IST

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే సభలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు.

నేటి నుంచి అసెంబ్లీ

  •  శాసన మండలి సమావేశాలు కూడా..
  • గవర్నర్‌ ప్రసంగం లేకుండా ప్రారంభం
  • వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన క్యాబినెట్‌
  • నేడు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న మంత్రులు
  • దళితబంధుకు కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి
  • అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టంగా బందోబస్తు
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్‌ సీవీ ఆనంద్‌
  • కరోనా పేరుతో మీడియాపై ఆంక్షల కొనసాగింపు

హైదరాబాద్‌/సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే సభలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. మరోవైపు ఇదే సమయానికి శాసన మండలి సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. అక్కడ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సభ ప్రారంభమైన మొదటి రోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసన సభ, శాసన మండలి సంయుక్త భేటీ నిర్వహిస్తారు. దీన్ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది.


కానీ, గత సమావేశాలు ప్రొరోగ్‌ కాలేదని, ప్రస్తుత సమావేశాలు వాటికి కొనసాగింపు మాత్రమే అనే కారణంతో గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తంచేయడం, బదులుగా ప్రభుత్వ వర్గాలు కౌంటర్‌ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సోమవారం నుంచి మొదలయ్యే సభలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించటానికి అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. కాగా,సోమవారం సభలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీ ఆమోదం తెలిపింది. ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఉద్యోగాల ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, టీచర్‌ పోస్టులకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీలకు భారీగా కేటాయింపుల అవసరం ఉంది. మరోవైపు వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల రంగాలకు గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు కావాలంటూ ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతుందనేది  చర్చనీయాంశంగా మారింది. గతేడాది రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఈసారి పెరిగిన అంచనాలతో రూ.2.7 లక్షల కోట్ల మేరకు పద్దు ఉండొచ్చని భావిస్తున్నారు.


కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పర్యవేక్షణలో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటుచేశారు. అసెంబ్లీ పరిసరాల్లో కిలోమీటర్‌ పరిధిలో ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్‌, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్‌, రిజర్వ్‌ ఫోర్స్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌, లా అండ్‌ ఆర్డర్‌, తదితర విభాగాల వారితోపాటు జిల్లాలకు చెందిన పోలీసులు కూడా బందోబస్తు విధుల్లో పాలుపంచుకుంటున్నారు. వీఐపీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.


మీడియాకు లాబీల్లోకి అనుమతి నిరాకరణ

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కొవిడ్‌ ఆంక్షలు లేవు. కానీ, కరోనా పేరుతో శాసనసభ, శాసనమండలి వార్తల కవరేజీ విషయంలో మీడియాపై ఆంక్షలను కొనసాగిస్తున్నారు. సాధారణంగా లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్‌లో మీడియాకు అనుమతి ఉంటుంది. కరోనా మొదలయ్యాక అసెంబ్లీ, మండలిలో గ్యాలరీ కవరేజీ కోసం ఒక్కో మీడియా సంస్థకు ఒక్క పాస్‌నే ఇస్తున్నారు. లాబీల్లోకి అనుమతిచ్చే పాసులు ఇవ్వలేదు. గ్యాలరీ కవరేజీ కోసం పరిమితంగా రెండు పాసుల చొప్పున జారీ చేశారు. మీడియా పాయింట్‌ వరకు మాత్రం అనుమతి ఇచ్చారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-03-07T08:27:39+05:30 IST