శాసన సభ ఎన్నికలు : నిబంధనలను సడలించిన ఈసీ

ABN , First Publish Date - 2022-02-06T20:40:18+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం

శాసన సభ ఎన్నికలు : నిబంధనలను సడలించిన ఈసీ

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల కమిషన్ సవరించింది. సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనూ, ఆరుబయలు మైదానాల్లో 30 శాతం సామర్థ్యంతోనూ బహిరంగ సభలను నిర్వహించవచ్చునని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శితోనూ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ శనివారం చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 


కోవిడ్-19 పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని, ఈ రోగులు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం కూడా తగ్గిందని ఈ అధికారులు చెప్పినట్లు తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక పరిశీలకుల్లో అత్యధికులు ఈ ఆంక్షలను సడలించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుతోందని, ఎన్నికలు లేని రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పినట్లు తెలిపింది. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి ఈ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2022-02-06T20:40:18+05:30 IST