అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2020-11-29T05:30:00+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. పాలకులు నవరత్నాలను అమలు చేయడంలో తరిస్తున్నారు తప్పా... అభివృద్ధి వైపు దృష్టి సారించలేదు.

అభివృద్ధి శూన్యం

నిధుల లేమితో ముందుకు సాగని పనులు

రూ. వందల కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

కార్మికులకు తప్పని వేతన వెతలు

భారీ వర్షాలు, నివర్‌ తుఫాన్‌తో రైతు కుదేలు

పంటనష్ట పరిహారంలోనూ రాజకీయం

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

అనంతపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. పాలకులు నవరత్నాలను అమలు చేయడంలో తరిస్తున్నారు తప్పా... అభివృద్ధి వైపు దృష్టి సారించలేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన సాగు, తాగు నీటి పనులను కూడా పూర్తి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. హంద్రీనీవా విస్తరణ, హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు అటకెక్కించారు. భైరవాన్‌తిప్ప ప్రాజెక్టును మరిచారు. కొత్త రిజర్వాయర్‌ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ప్రతి శాఖను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. రూ. వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు నిదర్శనం.  వరుస భారీ వర్షాలు, నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతులను అతలాకుతలం చేశాయి. కోతకొచ్చిన వేరుశనగ, వరి, ఇతరత్రా పంటలు దాదాపు 10 వేల హెక్టార్లకుపైగా దెబ్బతిన్నాయి. రూ. వంద కోట్లదాకా రైతులు నష్టపోయారు. బాధిత రైతులంతా నష్టపరిహారం కోసంఎదురుచూస్తున్నారు. అయితే స్థానిక రాజకీయంతో కొందరు రైతులకే పరిహారం అందుతోంది. వర్షాలతో జిల్లాలోని రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం అర్బన్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీ ఇప్పటికీ సాకా రం కాలేదు. ఇలా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సమస్యల సుడిగుండంలో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనైనా ఎమ్మెల్యేలు వారి వాణిని వినిపించి జిల్లాకు నిధులు తీసుకొస్తారో... లేదా ఉసూరుమనిపిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సమస్యలు....


పెండింగ్‌ బిల్లులిలా....

- అనంతపురం నగరంలో చిన్న వర్షమొచ్చినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లుతోంది. వందల సంఖ్యలో కార్మికులకు తోడు పదుల సంఖ్యలో వార్డు శానిటేషన్‌ సెక్రటరీలున్నా సమస్యను పరిష్కరించే నాథుడే లేడు. డంపింగ్‌ యార్డు సమస్య అలాగే ఉండిపోయింది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. 409 మంది పారిశుధ్య కార్మికులకు పెంచిన రూ. 6000 హెల్త్‌ అలవెన్స్‌ ఐదు నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. 

- మంత్రి శంకరనారాయణ నేతృత్వం వహిస్తున్న రోడ్లు, భవనాల శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ), రెగ్యులర్‌ అధికారులు లేరు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజన్లకు డీఈలనే ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఇప్పటికీ ఇన్‌చార్జ్‌ల పాలనలోనే ఆ శాఖ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 200 కోట్ల పనులు నిలిచిపోయాయి. రూ. 25 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని పనులకు టెండర్లు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు ఉదా హరణ ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌ నుంచి గుత్తిరోడ్డు వరకూ రోడ్డు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం టెండర్లు పిలిచినా... ఇప్పటికీ పనులు జరగలేదు. జిల్లాలో ప్రధాన రహదారుల(ఎండీఆర్‌)తో పాటు రాష్ట్ర రహదారులు, రైల్వే బ్రిడ్జిలు(ఆర్‌ఓబీ) నిర్మాణాలకు సం బంధించి చేసిన పనులకు రూ. 150 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 

- జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)లో 2019 నవంబరు నుంచి ఇప్పటి వరకూ మెటీరియల్‌ బిల్లులు రూ. 254 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీఎంఐపీకి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదు. దీంతో డ్రిప్పు కోసం వేలాది మంది రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. ఉద్యానశాఖ, పశుసంవర్థక శాఖలదీ ఇదే పరిస్థితి. ఈ రెండు శాఖలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. వ్యవసాయ శాఖలో కేవలం కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లకు మాత్రమే నిధులు మంజూరు చేశారు. మిగిలిన పథకా లకు నిధులు విడుదల చేయలేదు. 

- సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రికి సంబంధించి రాష్ట్ర వాటా రూ. 40 కోట్ల నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. దీంతో ఆస్పత్రి పూర్తయినా ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. మరోవైపు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రూ. కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్న సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనం ఇవ్వలేదు.  వీరికోసం రూ. 18 కోట్లు దాకా నిధులు విడుదల కావాల్సి ఉంది. వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కరోనా సమయంలో బాధితులకు భోజనాలు అందించిన ఏజెన్సీలకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా సర్వజనాస్పత్రిని సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడ ప్రత్యేక ప్రసవ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అది కనిపించడం లేదు.

- జిల్లాలో నేతన్న నేస్తం కోసం కొందరు అర్హులైన చేనేతలకు ఎదురుచూపులే మిగిలాయి.  జిల్లాలో నేతన్న నేస్తం కింద మొదటి విడతలో 27 వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇంకా 3500 మందికిపైగా నేతన్న నేస్తం లబ్ధి అందలేదు. 

- అమృత్‌ పథకానికి నిధులు విడుదల చేయడంలోనూ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల వాటాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని పాలకవర్గాల వాటాగా మొత్తంగా రూ. 365.46 కోట్లతో మున్సిపాల్టీల్లో వాటర్‌ ట్యాంకు నిర్మాణాలు, పైపులైన్‌లకు సంబంధించి పనులు చేపట్టారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రూ. 40.98 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 16.20 కోట్లు, యూఎల్‌బీ ద్వారా రూ. 145.64 కోట్లు విడుదల కావాల్సి ఉన్నా... పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ఎక్కడిపనులే అక్కడే ఆగిపోయాయి. 

- గ్రామ సచివాలయాలు గత ఏడాది అక్టోబరు 2న ప్రారంభించడానికి చేసిన ఖర్చు రూ. 10 లక్షలు, వలంటీర్ల శిక్షణకు సంబందించిన ఖర్చు 60 శాతం చెల్లించారు. ఇంకా 40 శాతం అంటే సుమారు రూ. 22 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో నియోజకవర్గ స్థాయిలో సచివాలయ కార్యదర్శులకు ఇచ్చిన శిక్షణకు సంబంధించిన ఖర్చులు మరో రూ. 35 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. 

- నాడు-నేడు పనులకు సంబంధించి జిల్లాలో రూ. 374.31 కోట్ల పనులకు అంచనాలు వేశారు. అయితే నేటి వరకూ ప్రభుత్వం కేవలం రూ. 170.35 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. మిగిలిన నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో లక్ష్యం నీరుగారుతోంది. గ్రామ పంచాయతీలకు పారిశుధ్యం నిధులు మినహా.... మిగతావి విడుదలకాని పరిస్థితి.  దీంతో గ్రామాలను పారిశుధ్య సమస్య వెంటాడుతోంది. 

- జిల్లాలో 14 క్రీడా వికాస కేంద్రాల్లో 3 పూర్తయ్యాయి. మిగిలిన వాటికి రూ. 22 కోట్ల నిధులు అవసరం. జిల్లాలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 28 నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణలో అధికారులు నిర్లక్ష్యంతో   రూ. 190 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ఈబీసీ సబ్సిడీ రుణాల రద్దుతో 15 వేల మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందని ద్రాక్షగా మారింది. 

- నీరు-చెట్టు పనులకు సంబంధించి ఇప్పటికీ జిల్లాలో రూ. 120 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. 

- జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రభుత్వ ఇళ్లకు సంబంధించి 42 వేల గృహాల లబ్ధిదారులకు ఇప్పటికీ రూ. 112 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈ పెండింగ్‌ బిల్లుల సంగతినే మరిచింది. 

Updated Date - 2020-11-29T05:30:00+05:30 IST