ఆరెస్సెస్‌ కార్యకర్త హత్య

ABN , First Publish Date - 2021-02-26T09:36:46+05:30 IST

కేరళలోని అళప్పుఝ జిల్లాలో ఓ ఆరెస్సెస్‌ కార్యకర్తను సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు హత్య చేశారు. బుధవారం రాత్రి జిల్లాలోని చేర్తాలా పట్టణానికి

ఆరెస్సెస్‌ కార్యకర్త హత్య

కేరళలో నరికి చంపిన ఎస్డీపీఐ కార్యకర్తలు

అదుపులోకి ఎనిమిది మంది నిందితులు


అళప్పుఝ, ఫిబ్రవరి 25: కేరళలోని అళప్పుఝ జిల్లాలో ఓ ఆరెస్సెస్‌ కార్యకర్తను సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు హత్య చేశారు. బుధవారం రాత్రి జిల్లాలోని చేర్తాలా పట్టణానికి సమీపంలో నాగంకులంగరలో ఈ ఘటన జరిగింది. ఇటీవలే కేరళలో పర్యటించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఆరోజు రాత్రి ఎస్డీపీఐ కార్యకర్తలు నాగంకులంగరలో ప్రదర్శనలు నిర్వహిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆరెస్సెస్‌ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. క్రమంగా ఇది హింసకు దారితీసింది. ఈ గొడవలో నందు కృష్ణ (26) అనే ఆరెస్సెస్‌ కార్యకర్తను ఎస్డీపీఐ కార్యకర్తలు నరికి చంపారు. అలాగే ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కూడా గాయపడ్డారు. పోలీసులు వారిని అళప్పుఝ, ఎర్నాకుళంలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


ఎనిమిది మంది ఎస్డీపీఐ నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. యూపీ సీఎం యోగి ఇటీవలే కేరళలో పర్యటించి కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వరకు ‘బీజేపీ విజయ్‌ యాత్ర’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఎస్డీపీఐ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాగా ఆరెస్సెస్‌ కార్యకర్త హత్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. హత్యను నిరసిస్తూ అళప్పుఝ జిల్లాలో గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్డీపీఐ, పాలక సీపీఎం నేరస్థులతో కేరళ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్‌ విమర్శించారు. ఎస్డీపీఐ మాతృ సంస్థ అయిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) కార్యకలాపాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పీఎ్‌ఫఐ వంటి ఉగ్రవాద సంస్థలను కాంగ్రెస్‌, వామపక్ష నేతలు ప్రోత్సహిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఆరోపించారు. కేరళలో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

Updated Date - 2021-02-26T09:36:46+05:30 IST