మమ్మల్ని కూడా విడుదల చేయండి

ABN , First Publish Date - 2022-05-30T16:24:10+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయి పేరరివాలన్‌ను విడుదల చేసినట్టుగా తమను కూడా విడుదల చేయాలని కోరుతూ నళిని, మురుగన్‌ సహా

మమ్మల్ని కూడా విడుదల చేయండి

త్వరలో హైకోర్టుకు ‘ఆ ఆరుగురు’


చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయి పేరరివాలన్‌ను విడుదల చేసినట్టుగా తమను కూడా విడుదల చేయాలని కోరుతూ  నళిని, మురుగన్‌ సహా ఆరుగురు వచ్చేవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇటీవల పేరరివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ ఆరుగురు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. రాజీవ్‌హత్య కేసు ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌, శాంతన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌ పుళల్‌ సెంట్రల్‌ జైలులో, రవిచంద్రన్‌ మదురై సెంట్రల్‌ జైలులో ఉన్నారు.


ఈ కేసులో దోషిగా వున్న మరో ముద్దాయి పేరరివాలన్‌ను ఈ నెల 18న సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపట్ల కాంగ్రెస్‌ మినహా డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని రాజకీయ పార్టీలు హర్షం ప్రకటించాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామిని పేరరివాలన్‌, అతడి తల్లి అర్బుదమ్మాళ్‌ కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డీఎంకే కూటమిలోని ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ పేరరివాలన్‌ విడుదలపై తీవ్ర ఆగ్రహం ప్రకటించింది.


అదే సమయంలో రాజీవ్‌హత్య కేసు ముద్దాయిలైన తక్కిన ఆరుగురిని విడుదల చేసే విషయమై న్యాయనిపుణులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని స్టాలిన్‌ ప్రకటించారు. ఆ మేరకు ఊటీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన వీడియో కాన్షరెన్స్‌ ద్వారా న్యాయనిపుణులతో చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో ఐదోసారి పెరోల్‌ పొంది కాట్పాడి బ్రహ్మపురంలో ఉంటున్న నళినిని ఆమె తరఫు న్యాయవాది పుగళేంది ఆదివారం ఉదయం కలుసుకున్నారు. ఆ తర్వాత పుగళేంది విలేఖరులతో మాట్లాడుతూ... రాజీవ్‌ హత్యకేసు ముద్దాయిలు ఏడుగురిని విడుదల చేయాలని శాసనసభ తీర్మానం చేసిందని, ఆ బిల్లును గవర్నర్‌ ఇటీవల రాష్ట్రపతికి పంపారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పేరరివాలన్‌ విడుదలపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుండా తీవ్ర జాప్యం చేశారంటూ సుప్రీం కోర్టు ఆరోపించి  ఆ తర్వాత పేరరివాలన్‌ను విడుదల చేస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తనను విడుదల చేయాలంటూ పేరరివాలన్‌ ప్రత్యేకంగా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ తీర్పునిచ్చిందన్నారు. అయితే ఒకే కేసుకు సంబంధించి ఏడుగురు ముద్దాయిలున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఏడుగురిని విడుదల చేసి ఉంటే సమంజసంగా ఉండేదన్నారు.


నళిని సహా ఆరుగురు ముద్దాయిలు విడుదల చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. జూన్‌ నెలాఖరులోగా ఆరుగురు ముద్దాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని భావిస్తున్నామ న్నారు.. ఇదిలా ఉండగా వేలూరు జైలులో ఉన్న మురుగన్‌కు అత్యవసరంగా ఆరు రోజుల పెరోల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య నళిని జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారని,  దానిని పరిశీలించి మురుగన్‌కు ప్రభుత్వం పెరోలు మంజూరు చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది తెలిపారు. అదే సమయం లో మురుగన్‌కు పెరోల్‌ మంజూరు చేయాలని కోరుతూ జూన్‌ ఒకటిన హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా తనను విడుదల చేయాలని కోరుతూ హైకోర్టులో నళిని వేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండటంతో పేరరివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తక్కిన ఐదుగురు ముద్దాయిలు కూడా వేర్వేరుగా పిటిషన్లు వేస్తారని నళిని తరఫు న్యాయవాది పుగళేంది తెలిపారు.

Updated Date - 2022-05-30T16:24:10+05:30 IST