అర్హులందరికీ ‘ఆసరా’..

ABN , First Publish Date - 2022-08-18T05:25:00+05:30 IST

ఎట్టకేలకు ఆసరా పథకం కింద కొత్త వారికి పింఛన్లు మంజూరయ్యాయి.

అర్హులందరికీ ‘ఆసరా’..

- మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర

- కొత్తగా 26,556 మందికి మంజూరు

- జిల్లాలో లక్ష మందికి పైగా పింఛన్‌దారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎట్టకేలకు ఆసరా పథకం కింద కొత్త వారికి పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో మూడున్నరేళ్ల తర్వాత వారి నిరీక్షణకు తెర పడినట్లయ్యింది. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల మంజూరును నిలిపివేసింది. ఉపఎన్నికలు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలకు మినహా ఇతర ప్రాంతాలకు పింఛన్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నామని ప్రకటించారు. అలాగే దివ్యాంగులకు 1,500 నుంచి 3,016 రూపాయలకు, ఇతరులకు 1,000 నుంచి 3,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మళ్లీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను సొమ్మును మాత్రమే పెంచారు తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. అసలు పింఛన్లు ఇక మంజూరు చేయరేమోనని వాటిపై ఆశలు వదులుకుంటున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి మంజూరు పత్రాలను అందజేస్తామని ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

జిల్లాలో 1,02,281లకు చేరిన సంఖ్య..

జిల్లాలో ఇప్పటివరకు 75,725 మంది ఆసరా పథకం ద్వారా ప్రతి నెలా పింఛన్లు అందజేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నాటికి 57 ఏళ్లు నిండిన వాళ్లు 22,640 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 16,531 మంది అర్హులుగా గుర్తించి వారికి పింఛన్‌ మంజూరుచేశారు. అలాగే వివిధ కేటగిరీల కింద 10194 మంది దరఖాస్తు చేసుకోగా, అవి చాలా రోజులుగా పెండింగులో ఉన్నాయి. వాటిని పరిశీలించి 10,025 మందిని అర్హులుగా గుర్తించారు. దీంతో జిల్లాలో ఆసరా పథకం కింద మంజూరు చేసిన పింఛన్ల సంఖ్య 1,02,281కి చేరుకున్నది. కొత్తగా 57 ఏళ్లు నిండిన వారిలో 16,531 మంది, 65 ఏళ్లు నిండిన వాళ్లు 2,538 మంది, వితంతువులు 5,148 మంది, దివ్యాంగులు 1,258 మంది, చేతే కార్మికులు 138 మంది, గీత కార్మికులు 305 మంది, బీడీ కార్మికులు ఐదుగురు, ఏఆర్‌టీ బాధితులు 268 మంది, ఫైలేరియా బాధితులు 18మందికి, మొత్తం 26,556 మందికి కొత్తగా పింఛన్లు మంజూరుచేశారు. చాలారోజులుగా పింఛన్లు ఎప్పుడు మంజూరు అవుతాయా అని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగింది. వారి ముఖాల్లో దరహాసం కనబడుతున్నది. ఆగస్టు 15వ తేదీన జిల్లాకేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌ కుమార్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ తదితరులు పింఛన్‌ మంజూరు పత్రాలను కొందరు లబ్ధిదారులకు అందజేశారు. ఈనెలలో గానీ, వచ్చేనెలలో గానీ పింఛన్ల సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జామ కానున్నదని డీఆర్‌డీవో శ్రీధర్‌ తెలిపారు. 

మళ్లీ అవకాశం కల్పించాలి..

ఆసరా పథకం ద్వారా 57 ఏళ్లు నిండిన వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 57 ఏళ్లు నిండిన వాళ్లు మీ సేవా, ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రెండుసార్లు అవకాశం కల్పించారు. 2020లో ఒకసారి, ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్‌ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునే నాటికి 57 ఏళ్లు నిండిన వాళ్లే దరఖాస్తు చేసుకున్నారు. తొమ్మిది నెలల తర్వాత అందులో అర్హులైన వారికి పింఛన్‌ మంజూరు చేశారు. ఈమధ్య కాలంలో 9 నెలల్లో అనేక మంది 57 ఏళ్లు నిండిన వాళ్లు ఉన్నారు. వారంతా తాము కూడా ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-08-18T05:25:00+05:30 IST