అసాంజే కష్టాలు

ABN , First Publish Date - 2022-04-22T09:58:51+05:30 IST

వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో, అంతిమ నిర్ణయం ఇప్పుడు బ్రిటన్ హోంమంత్రి ప్రీతిపటేల్ చేతుల్లోకి చేరింది...

అసాంజే కష్టాలు

వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో, అంతిమ నిర్ణయం ఇప్పుడు బ్రిటన్ హోంమంత్రి ప్రీతిపటేల్ చేతుల్లోకి చేరింది. బ్రిటన్ కోర్టుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అప్పగింత వ్యవహారం పలుదశలు దాటి దాదాపుగా చివరిఘట్టానికి చేరుకున్నట్టే కనిపిస్తున్నది. ఈ కేసులో అప్పీలుకు ఇంకా కొంత అవకాశం ఉన్నదనీ, ప్రీతీపటేల్ నిర్ణయం ఆధారంగా దానిని వినియోగిస్తామని అసాంజే న్యాయవాదులు అంటున్నారు. అసాంజే వ్యవహారాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో, బ్రిటన్ కూడా అప్పగింతకే మొగ్గుచూపుతుందనడంలో సందేహం అక్కరలేదు.


అసాంజేపై అమెరికా పెట్టిన కేసుల్లో గూఢచర్యం కేసులే డజనున్నరకుపైగా ఉన్నాయి. అవన్నీ రుజువైతే ఆయనకు 175 సంవత్సరాల జైలు శిక్షపడుతుందని లెక్క. అతడిని అమెరికా రప్పించి, జైల్లో కుక్కేయాలన్న తదేకలక్ష్యంతో ఆ దేశం పనిచేస్తున్నది. అమెరికా జైల్లో అసాంజే ఒంటరిగా ఉండి, పిచ్చెక్కి ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్నాయన్న వాదనతో అతడి న్యాయవాదులు చాలాకాలంగా అప్పగింతను అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం అప్పగింతకు అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో, అసాంజే వ్యవహారాన్ని ఇక ఎంతమాత్రం సాగదీసేందుకు వీల్లేని రీతిలో ప్రీతీపటేల్ నిర్ణయం తీసుకోవాలని అక్కడి లేబర్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం, పాత్రికేయ విలువలు, వాక్ స్వాతంత్ర్యం వంటివాటిపై బ్రిటన్ కు ఎంత విశ్వాసం ఉన్నదో ప్రీతీపటేల్ తన చర్యద్వారా రుజువుచేయాలని అధికులు కోరుతున్నారు. 


అమెరికా సైనిక, దౌత్యకార్యకలాపాలకు సంబంధించి అసాంజే ఆధ్వర్యంలో వికిలీక్స్ బయటపెట్టిన రహస్యాలు యావత్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆయన తన ధైర్యసాహసాలతో అమెరికా అధికారదాహాన్నీ, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాల్లో అది పాల్పడిన నేరాలను రట్టుచేశాడు. ఎన్ని అబద్ధాలతో ఆ యుద్ధాలకు అమెరికా దిగిందో ప్రపంచానికి అర్థమయ్యేట్టు చేశాడు. ఆయన చేసిన తప్పంటూ ఏమైనా ఉంటే అది పాలకులు రహస్యం అని ముద్రవేసినవాటిని ప్రజలకు తెలియచెప్పడం. ఎవరు ప్రజలకు అసత్యాలు చెప్పారో, యుద్ధనేరాలు చేశారో వారిని ఆయన బయటపెట్టాడు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన ప్రతీదశనూ, దుర్మార్గాలనూ లక్షలాది డాక్యుమెంట్లతో, విడియోలతో గుట్టువిప్పడం ద్వారా అమెరికా డొల్లతనాన్ని తెలియచెప్పాడు. అమెరికా ప్రజలమీద సీఐఏ నిఘా ఏ స్థాయిలో ఉన్నదో చెప్పాడు. నిజానికి, ప్రజాస్వామిక ప్రభుత్వాలుగా పిలిపించుకుంటున్నవి ఇటువంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా  వ్యవహరించాలి, యుద్ధనేరాలకు పాల్పడినవారిని శిక్షించాలి. కానీ, అమెరికా ప్రభుత్వం వాటిని వెలుగులోకి తెచ్చినవారిని వేధించడం ఆరంభించింది. అసాంజే పాత్రికేయుడు కాదన్న వాదన తో పాటుగా, 2019లో అతడి అరెస్టు తరువాత అప్పట్లో అమెరికా అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరింత బలమైన చట్టాలతో ఉచ్చుబిగించారు. అసాంజే మూడేళ్ళుగా బ్రిటన్ జైల్లో ఉన్నాడు. అంతకుముందు 2012 నుంచి లండన్ లోని ఈక్వడార్ దౌత్యకార్యాలయంలో తలదాచుకున్నాడు. స్వీడన్ లో లైగింకవేధింపులకు పాల్పడ్డాడన్న అభియోగాన్ని కూడా ఆయనమీద రుద్దారు. కొంతకాలానికి స్వీడన్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. 2019లో దౌత్యకార్యాలయం నుంచి ఆయనను బయటకు తెచ్చి, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో యాభైవారాలు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయనను బ్రిటన్ అమెరికాకు అప్పగించి, అక్కడ కేసులు నడిచి, జైల్లో మగ్గి, శిక్షలకు గురైతే పత్రికాస్వేచ్ఛ అన్నమాటకు అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యం గురించి ట్రంప్ పెద్దగా మాట్లాడలేదు కానీ, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ప్రపంచస్థాయి సదస్సులు నిర్వహించడమే కాక, అవకాశం వచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచుతున్నారు. ఇతరదేశాల్లో ప్రజాస్వామిక విలువలను తూకం వేస్తూ హెచ్చరికలూ చేస్తున్నారు.  తమవి ఉన్నత, ప్రాచీన ప్రజాస్వామికదేశాలుగా అమెరికా బ్రిటన్ చెప్పుకుంటాయి. పాత్రికేయవిలువలకూ, స్వేచ్ఛకూ తమ కట్టుబాటు ప్రకటించుకొనే ఈ అగ్రరాజ్యాలు రెండూ నిజాలను నిర్భయంగా నలుగురికీ తెలియచేసిన పాపానికి తన జీవితాన్ని అధికంగా నష్టపోయిన అసాంజేను ఇప్పటికైనా స్వేచ్ఛగా వదిలివేయడం ఉత్తమం.

Updated Date - 2022-04-22T09:58:51+05:30 IST