అందరినీ చంపలేదుగా అన్న మిజోరం ఎంపీ.. షాకిచ్చిన అస్సాం పోలీసులు

ABN , First Publish Date - 2021-07-31T06:41:27+05:30 IST

మిజోరం ఎంపీకి అస్సాం పోలీసులు షాకిచ్చారు. ఆగస్టు 1న తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు ..

అందరినీ చంపలేదుగా అన్న మిజోరం ఎంపీ.. షాకిచ్చిన అస్సాం పోలీసులు

దిస్‌పుర్: మిజోరం ఎంపీకి అస్సాం పోలీసులు షాకిచ్చారు. ఆగస్టు 1న తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపించారు. అస్సాం, మిజోరం సరిహద్దు వివాదం నేపథ్యంలో మిజోరం ఎంపీ కే వన్లావేన అస్సాం పోలీసుల మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస్సాం-మిజోరం రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇటీవల ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అస్సాంకు చెందిన అయిదుగురు పోలీసులు మరణించారు. దీనిపై మాట్లాడిన ఎంపీ.. ‘అస్సాం పోలీసులు అదృష్టవంతులు. మేము అందరినీ చంపలేదు కదా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అస్సాం పోలీసులు ఢిల్లీలోని ఎంపీ నివాసానికి నోటీసులు పంపించారు. ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని హెచ్చరించారు.


ఇదిలా ఉంటే అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం నేటిది కాదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలన నాటి నుంచే కొనసాగుతోంది. మొదటి సారి 1987లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈ మధ్య కాలంలో ఇరు రాష్ట్రాల మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అస్సాం-మిజోరం మధ్య 164.6 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అస్సాంలోని కచార్, మిజోరంలోని కొలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూభాగమే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం.


గతేడాది అక్టోబర్‌లో అస్సాం, మిజోరం ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ భూభాగం కోసం రెండుసార్లు తీవ్ర ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు కూడా. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఈ ప్రాంతంలో అనేక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Updated Date - 2021-07-31T06:41:27+05:30 IST