100 మీటర్లు వెనక్కి తగ్గిన అసోం పోలీసులు

ABN , First Publish Date - 2021-07-28T08:23:58+05:30 IST

ఈశాన్య రాష్ట్రాలు అసోం-మిజోరం మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. అయితే.. కేంద్రం సూచనల మేరకు అసోం పోలీసులు కచార్‌ జిల్లాలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులోని తమ పోస్టు నుంచి 100 మీటర్లు వెనక్కి వచ్చారు.

100 మీటర్లు వెనక్కి తగ్గిన అసోం పోలీసులు

  • అసోం-మిజోరం సరిహద్దుల్లో సద్దుమణగని ఉద్రిక్తత.. 
  • బోర్డర్‌ పోస్టు వద్దే మిజోరం పోలీసుల తిష్ట

గువాహటి/న్యూఢిల్లీ, జూలై 27: ఈశాన్య రాష్ట్రాలు అసోం-మిజోరం మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగలేదు. అయితే.. కేంద్రం సూచనల మేరకు అసోం పోలీసులు కచార్‌ జిల్లాలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులోని తమ పోస్టు నుంచి 100 మీటర్లు వెనక్కి వచ్చారు. మిజోరం పోలీసులు మాత్రం సాయుధులై అక్కడే తిష్ట వేయడం.. అసోం ప్రభుత్వం కచార్‌లో మూడు బెటాలియన్ల కమాండోలను మోహరించడంతో.. ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవుల విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తరచూ ఇరు రాష్ట్రాల పోలీసులు, పౌరుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. సోమవారం ఈ వివాదం పతాకస్థాయికి చేరుకోవడంతో.. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు తొలుత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించినా.. మంగళవారం ప్రభుత్వం అమరులైన పోలీసుల సంఖ్యను ఐదుగా నిర్ధారించింది. మరో వ్యక్తి సాధారణ పౌరుడని గుర్తించినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కుటుంబానికి ఒక ప్రభుత్వోద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. సోమవారం నాటి ఘటనలో మిజోరం పోలీసులు లైట్‌ మిషన్‌ గన్‌(ఎల్‌ఎంజీ) వంటి ఆయుధాలతో కాల్పులు జరిపారని పేర్కొంది. అసోం-మిజోరం మధ్య సోమవారం నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. హోంమంత్రి అమిత్‌షా ఈ దేశాన్ని ఫెయిల్‌ చేయిస్తున్నారంటూ ట్విటర్‌లో ఆయన విమర్శించారు.

Updated Date - 2021-07-28T08:23:58+05:30 IST