అసోం కాంగ్రెస్‌కు దెబ్బ.. మరో ఎమ్మెల్యే రాజీనామా, 2న బీజేపీ గూటికి

ABN , First Publish Date - 2021-07-31T22:32:56+05:30 IST

అసోం కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తలిగింది. ఎగువ అసోంలోని థోవ్రా నియోజకవర్గం..

అసోం కాంగ్రెస్‌కు దెబ్బ.. మరో ఎమ్మెల్యే రాజీనామా, 2న బీజేపీ గూటికి

గువాహటి: అసోం కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తలిగింది. ఎగువ అసోంలోని థోవ్రా నియోజకవర్గం ఎమ్మెల్యే సుశాంత బోర్గోహెయిన్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల క్రితం ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా, అందుకు ప్రతిగా ఆయన తన రాజీనామాను పంపారు. ఆయన రాజీనామాను అంగీకరించినట్టు అసోం కాంగ్రెస్ చీఫ్ భూపెన్ బోరా తెలిపారు. తాము పంపిన నోటీసుకు బోర్గోహెయిన్ రాజీనామా చేస్తున్నానంటూ సమాధానం ఇచ్చారని, దీనిపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నామని భూపెన్ బోరా శనివారం ఉదయం మీడియాకు తెలిపారు. బీజేపీలోకి బోర్గోహెయిన్ చేరబోతున్నారనే ఊహాగానాల నడుమ ఆయన పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, ఆగస్టు 2న జరిగే కార్యక్రమంలో బోర్గోహెయిన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని కోఖ్రాఝర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి రాన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం ఎమ్మెల్యేల ఫిరాయింపులు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రుప్‌జ్యోతి కూర్మి ఈనెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

Updated Date - 2021-07-31T22:32:56+05:30 IST