Assam floods: 8 మంది మృతి, మరో ఐదుగురి గల్లంతు

ABN , First Publish Date - 2022-05-19T16:44:47+05:30 IST

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తుతున్నాయి....

Assam floods: 8 మంది మృతి, మరో ఐదుగురి గల్లంతు

గువహటి : అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. 26 జిల్లాల్లోని 1,089 గ్రామాలు వరదనీటిలో మునిగిపోవడంతో పాటు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద విపత్తుకు 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వరదల వల్ల కాచర్‌లో ఇద్దరు, ఉదల్‌గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.కొండచరియలు విరిగిపడటంతో డిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒకరు మరణించారు.నాగావ్ జిల్లాలో మరో ఐదుగురు అదృశ్యమయ్యారు. నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు.భారీ వర్షాల వల్ల నాగావ్ జిల్లాలో వరద పరిస్థితి మరింత దిగజారింది. కాచర్‌లో 40,000 మంది ప్రజలు వరద విపత్తులతో అల్లాడుతున్నారు. 


సైన్యం, పారా మిలటరీ బలగాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర పోలీసుల అగ్నిమాపక, అత్యవసర బలగాలు వరదనీటిలో చిక్కుకున్న 3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 సహాయ శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాటు చేసింది. 39, 558 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు.ప్రస్తుతం కంపూర్, ధర్మతుల్ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ నది, ఏపీ ఘాట్ వద్ద బరాక్ నది, కరీంనగర్ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.



రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

Updated Date - 2022-05-19T16:44:47+05:30 IST