గౌహతి: ఎమ్మెల్యేలతో బేరసారాలకు (హార్స్ ట్రేడింగ్) బీజేపీ పాల్పడుతోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా 'గుర్రం' (హార్స్) ఎక్కి మరీ అసోం కాంగ్రెస్ నేత ఒకరు వినూత్న నిరసన తెలిపారు. నానాటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు సైతం ఆయన నిరసన తెలిపారు. తేజ్‌పూర్ నియోజకవర్గం లోక్‌సభ మాజీ ఎంపీ రామ్ ప్రసాద్ సర్మాహ్ శుక్రవారంనాడు గౌహతిలో రద్దీగా ఉన్న రోడ్లపై గుర్రం ఎక్కి హల్చల్ చేశారు. గుర్రం మెడలో ప్లకార్డ్ వేలాడ దీశారు. ''ఇంధనం అవసరం లేని వాహనం'' (ఫ్యూయల్ ఫ్రీ వెహికల్), 'హార్డ్ ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా హార్స్' (హార్స్ ఎగైనెస్ట్ హార్స్ ట్రేడింగ్), 'గుర్రం ఎక్కండి, ఇంధనం ఆదా చేయండి' (రైడ్ హార్స్, సేవ్ ఫ్యూయల్) అంటూ ఆ ప్లకార్డ్‌పై రాసి ఉంది.
ఇవి కూడా చదవండి
కాగా, ఇంధనం ధరలు మండిపోతుండటం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటడంపై నిరసనగా ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) సైతం శుక్రవారం ఉదయం భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ధరలను అదుపు చేయడంలో విఫలమైన పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రంజీత్ కుమార్ దాస్ రాజీనామా చేయాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ప్లకార్లులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు.