చిల్లకొండయ్యపల్లి ప్రమాదానికి కారణం ‘ఉడుతే’..: ASPDCL SE

ABN , First Publish Date - 2022-06-30T18:20:03+05:30 IST

జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో జరిగిన ఆటో ప్రమాదంపై ఏస్పీడీసీఎల్ ఎస్ఈ నాగరాజు వివరణ ఇచ్చారు

చిల్లకొండయ్యపల్లి ప్రమాదానికి కారణం ‘ఉడుతే’..: ASPDCL SE

శ్రీ సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో జరిగిన ఆటో ప్రమాదంపై ఏస్పీడీసీఎల్ ఎస్ఈ( ASPDCL SE) నాగరాజు వివరణ ఇచ్చారు. విద్యుత్ వైర్లు తెగి పడటానికి ప్రమాదానికి కారణం ఉడుత అని తెలిపారు. ఉడుత వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదని... ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆపరేషన్‌కు విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ అయ్యి ఆటో‌పై పడిందన్నారు. ఎక్కడైనా లైన్ కట్ అయితే సబ్ స్టేషన్ ట్రిప్ అవుతుందని.. కానీ ఈ ఘటనలో అది జరగలేదని అన్నారు. శాఖాపరంగా విచారణ జరుపుతున్నామని.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ఏస్పీడీసీఎల్ ఎస్ఈ నాగరాజు తెలిపారు. 


ఐదుగురి సజీవ దహనం...

సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో ఘోరప్రమాదం జరిగింది.  కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కార్....

ప్రమాదంపై సీఎం జగన్(Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పారిస్‌(Paris) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ(CMO) అధికారులు తెలియజేశారు. ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం(AP Government) రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్ తెలిపారు.

Updated Date - 2022-06-30T18:20:03+05:30 IST