అడుగుకో గుంత.. ప్రయాణానికి చింత

ABN , First Publish Date - 2021-11-29T06:36:10+05:30 IST

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అడుగుకో గుంతపడి ప్రమాదకరంగా ఉన్నాయి. అటుగా వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. మోకాళ్లలోతు గుంతలు ఏర్పడటంతో వర్షం వచ్చినప్పుడు కనీసం నడిచివెళ్లే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన పాత మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రహదారి దారుణంగా మారింది.

అడుగుకో గుంత.. ప్రయాణానికి చింత
జిల్లా కేంద్రంలో గుంతలమయమైన పాత మెయిన్‌రోడ్డు

ప్రధాన పట్టణాల్లో అస్తవ్యస్తంగా రహదారులు

వర్షం వస్తే నడిచే పరిస్థితీ లేదు 


 సూర్యాపేటటౌన్‌, కోదాడ, హుజూర్‌నగర్‌ , నేరేడుచర్ల: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అడుగుకో గుంతపడి ప్రమాదకరంగా ఉన్నాయి. అటుగా వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. మోకాళ్లలోతు గుంతలు ఏర్పడటంతో వర్షం వచ్చినప్పుడు కనీసం నడిచివెళ్లే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన పాత మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రహదారి దారుణంగా మారింది. కోదాడలో హుజూర్‌నగర్‌ క్రాస్‌రోడ్డు నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్డు వరకు రోడ్డు గుంతలమయమైంది. హుజూర్‌నగర్‌లో పదేళ్లక్రితం నిర్మించిన ప్రధాన రహదా రి, బైపాస్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నేరేడుచర్లలో జాతీయ రహదారి-167 పనులకోసం గతంలో ఉన్న రోడ్డును తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


జిల్లా కేంద్రంలోని రహదారులపై ప్రయాణించాలంటే ప్రజలకు నరకయాతనగా మారింది. మోకాళ్లలోతు గుంతల కారణంగా వర్షం వస్తే ఏ గుంతలో వాహనం పడుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన పాత మెయిన్‌ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విస్తరణ కోసం రహదారిని తవ్వి వదిలేయడంతో కనీసం నడిచే పరిస్థితి లేదు. పాతమెయిన్‌రోడ్డు, వాణిజ్యభవన్‌, చర్చికాంపౌండ్‌, పాత బస్టాండ్‌, కోర్టు చౌరస్తా, కల్నల్‌ సంతో్‌షబాబు చౌరస్తా, పోస్టాఫీస్‌, ఎంజీరోడ్డు, తెలంగాణతల్లి విగ్రహం ప్రాంతాల్లోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. కొన్ని చోట్ల ప్యాచ్‌వర్క్‌ చేసినా, ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాత రహదారి విస్తరణకు ప్రభుత్వం రూ.28.50కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రహదారి విస్తరణతోపాటు మురుగు కాల్వలు, సెంట్రల్‌ లైటింగ్‌, పుట్‌పాత్‌, గ్రీనరీ, డివైడర్లు నిర్మించాల్సి ఉంది. అయితే పీసీఆర్‌ సెంటర్‌ నుంచి జమ్మిగడ్డ వరకు కొంతమేర పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత కోర్టు కేసుల కారణంగా ఈ పనులు నిలిచాయి. దీంతో రహదారులు అస్తవ్యస్తంగా మారడంతోపాటు వ్యాపార, వాణిజ్య కేంద్రమైన మెయిన్‌ రోడ్డు, అలంకార్‌ రోడ్డు, బొడ్రాయి బజార్‌లో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎంజీరోడ్డు, కొత్తబస్టాండ్‌ నుంచి శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వరకు అడుగడుగునా గుంతలు ఉన్నాయి. కుడకుడ ప్రధాన రహదారిపై మోకాళ్లలోతు గుంతలు ఏర్పడ్డాయి. అండర్‌ డ్రైనేజీ నిర్మాణాల కోసం చర్చి కాంపౌండ్‌ ప్రాంతంలో తవ్వకాలు చేయడంతో వీధులన్నీ గుంతలమయమయ్యాయి.


కో‘దడ’

కోదాడలో ప్రధాన రహదారులు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. అడుగుకో మో కాళ్లలోతు గుంతలు వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఖమ్మం క్రాస్‌రోడ్డు, ఆర్‌అండ్‌ బీ, హుజుర్‌నగర్‌ క్రాస్‌రోడ్డు, సూర్యాలాబ్‌ ఎదురుగా, కరూర్‌వైశ్య బ్యాంకు, శ్రీనివా్‌సరెడ్డి ఆస్పత్రికి వెళ్లే రహదారుపై ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని వాహనాదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రహదారులపై కనీసం గుంతలు పూడ్చి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఈనెల 3న బీజేపీ నాయకులు నిరసన సైతం వ్యక్తం చేశారు.


శిథిల దారులతో అవస్థలు

హుజూర్‌నగర్‌ పట్టణంలోని ప్రధాన ఇందిర సెంటర్‌ నుంచి సుధాబ్యాంక్‌, శాంతిస్తూపం సెంటర్‌, తెలంగాణ చౌరస్తా, పొట్టి శ్రీరాములు సెంటర్‌లతో పాటు లింగగిరిరోడ్డు అధ్వానంగా మారింది. మెయిన్‌రోడ్డుపై తరచూ నీటి పైప్‌లైన్లు ధ్వంసమై గుంతలు ఏర్పడుతున్నాయి. 50 అడుగులు కూడా లేని లింగగిరి రోడ్డు సుమారు 800 మీటర్ల వరకు పూర్తిగా ధ్వంసమైంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.22 కోట్లతో నిర్మించిన వేపలసింగారం బైపా్‌సరోడ్డుపై ఆరు కిలోమీటర్లమేర అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. పదేళ్ల క్రితం నిర్మించిన ప్రధాన రహదారి, బైపాస్‌ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మట్టపల్లికి వెళ్లే రహదారి పరిస్థితి సైతం ఇలాగే ఉంది. మట్టపల్లికి వెళ్లే దారిలో గుంతల కారణంగా ఇటీవల ఓ లారీ ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. రెండుమోటార్‌ సైకిళ్లు ఢీకొనగా భార్యాభర్త ప్రాణాలు విడిచారు. పట్టణ అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరుకాగా, ఇందిరసెంటర్‌ నుంచి లింగగిరి రోడ్డు మీదుగా మట్టపల్లి బైపాస్‌ రోడ్డు నుంచి వేంకటేశ్వరస్వామి జంక్షన్‌ వరకు రోడ్డు మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే కౌన్సిలర్ల మధ్య రాజకీయ విభేదాలు, కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచాయి. 


తవ్వి వదిలేశారు..

నేరేడుచర్లలో జాతీయ రహదారి-167 పనుల కోసం పాత రహదారిని ఇరువైలా తవ్వి వదిలేశారు. ఈ ఏడాది జనవరి నెలలో పనులు ప్రారంభించ గా, ప్రస్తుతం నిలిచాయి. 11 నెలలుగా పనులు పూర్తికాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి వెంట డ్రైనేజీ పనులు కూడా నిలిచాయి. అంతేగాక ఈ రహదారి వెంట ఉన్న మండలంలోని పలు గ్రామాల్లో సైతం పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై ప్రయాణించాలంటే గుంతలు, దుమ్ముధూళితో ఇక్కట్లు పడుతున్నామని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



గుంతలతో నిత్యం ప్రమాదాలు : గోపనబోయిన సైదులు, సూర్యాపేట

జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. చినుకు పడితే నీరు నిలిచి అవస్థలు ఎదుర్కొంటున్నాం. రోడ్డుపై గుంతలతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలి.


రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తోంది : కనగాల నారాయణ, బీజేపీ నేత, కోదాడ

అడుగడుగునా గుంతలతో రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తోంది. ప్రాణం అరచేతిలో పెట్టుకొని వాహనం నడపాల్సివస్తోంది. గుంతలతో వాహనదారులు రోజూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలి.


ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లలేకపోతున్నాం : బాలెన సైదులు, నేరేడుచర్ల

జాతీయ రహదారి పనులకోసం పాత రోడ్డును తవ్వి వదిలేశారు. ఇంట్లోంచి రోడ్డుపైకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేమంతా కలిసి కాంట్రాక్టర్‌ను నిలదీస్తే రెండు రోజుల్లో పని పూర్తిచేస్తామని చెప్పి వెళ్లారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. 



వారంలో మరమ్మతులు ఞ: పవన్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఈ, కోదాడ

కోదాడ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడంతోపాటు మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వారంలో రూ.7లక్షలతో రహదారి మరమ్మతులు చేస్తాం.


Updated Date - 2021-11-29T06:36:10+05:30 IST