రోడ్ల మరమ్మతుకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2020-09-27T12:50:24+05:30 IST

సిఫాబాద్‌ ఏజెన్సీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ..

రోడ్ల మరమ్మతుకు మోక్షమెప్పుడో?

వర్షాలకు గుంతలు తేలిన ప్రధాన రహదారులు

అరకొర నిధులతో ఇక్కట్లు

ప్రతిపాదనలకు మోక్షం కల్పించని ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వాగులు, వంకలతో రోడ్లన్నీ జలమయమై వర్షాకాలం నరకాన్ని చూపి స్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతిని గుంతలు తేలాయి. దాంతో ఈ రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిదిలో భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీకి చెందిన సుమారు 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌-ఆదిలాబాద్‌ ప్రధాన రహదారిపై ఆసిఫాబాద్‌-జైనూర్‌ ప్రాంతాల మధ్య 20కి పైగా ప్రదేశాల్లో రోడ్లు గుంతలు తేలాయి. 

పంచాయతీరాజ్‌ రహదారులకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా యాబై కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు ఆ శాఖకు కూడా రూ.50 లక్షల వరకు నిధులు అవసరమవుతాయని తేల్చారు. అయితే ఈ రోడ్ల మరమ్మతుల కోసం ఆయా శాఖలు రెండు కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. తాత్కాలిక మరమ్మతులతో పాటు, శాశ్వతంగా రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మరమ్మతులకు ఒక్క పైసా విడుదల చేయలేదు.


ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప గుంతలు తేలిన రోడ్లకు ప్యాచ్‌ వర్కు పనులు చేసే పరిస్థితి లేదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఇక శాశ్వత నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.14.85 కోట్లు, పంచాయతీరాజ్‌ గ్రామీణ రోడ్లకు రూ.12.22 కోట్లు అవసరమవుతాయని ఇదివరకే ప్రభుత్వానికి నివేదించి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతీ ఏట రోడ్ల శాశ్వత నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపించడం, ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి పైసా రాని పరిస్థితుల్లో అందుబాటులో ఉండే స్థానిక నిధులను వినియోగించి మొక్కుబడిగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రతీ ఏటా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

రోడ్ల నిర్మాణానికి రూ.500 కోట్లతో ప్రతిపాదనలు

జిల్లాలో రహదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే కనీసం 300 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ నిధులు కేవలం మట్టి రోడ్ల నిర్మాణానికి మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఇవికాకుండా ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్ల అభివృద్ధికి (బీటీ రోడ్లుగా మార్చడం కోసం) మరో 200 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వే శారు. అయితే ఈ ప్రతిపాదనలకు నాలుగేళ్లుగా మోక్షం లభించలేదు. ప్రతీ ఏటా వర్షాకాలంలో మట్టిరోడ్లు నామరూపాల్లేకుండా ధ్వంసం అవుతున్నాయి. దీంతో పక్కా రోడ్లు నిర్మించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అధికారులు గుర్తించి గతంలోనే 500 కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.

Updated Date - 2020-09-27T12:50:24+05:30 IST