పేదింటి అమ్మాయిలకు చదువును దూరం చేయడమే!

ABN , First Publish Date - 2021-07-26T06:05:39+05:30 IST

నాంపల్లిలోని కమలానెహ్రూ కాలేజీ...ఆసియాలోనే తొలి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల. అమ్మాయిలకు సాంకేతిక రంగంలో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వహణలో అరవై ఏళ్ల కిందట మొదలైంది...

పేదింటి అమ్మాయిలకు చదువును దూరం చేయడమే!

నాంపల్లిలోని కమలానెహ్రూ కాలేజీ...ఆసియాలోనే తొలి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల. అమ్మాయిలకు సాంకేతిక రంగంలో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వహణలో అరవై ఏళ్ల కిందట మొదలైంది. అదీ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ చొరవతో. ఇక్కడ చదివిన వారెందరో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు. ఈ కళాశాలను ప్రైవేటుపరం చేస్తున్నట్టు వార్తలు రావడంతో పూర్వ విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు స్పందించారు. ఆ కళాశాలతో వారికున్న అనుబంధాన్ని నవ్యతో పంచుకున్నారు.





భవిష్యత్తుకు బాట చూపిన కాలేజీ

‘కమలానెహ్రూ పాలిటెక్నిక్‌ కాలేజీ’...పేదింటి అమ్మాయిలకు చదువులమ్మ ఒడి. నాకు మాత్రం అంతకు మించి.! చిన్నతనంలోనే పెళ్లైన నన్ను అక్కున చేర్చుకొని, నా భవిష్యత్తుకు బాట చూపింది అదే కాలేజీ. నన్ను ఒక ఇంజినీరుగా నిలబెట్టింది.! అందులో చదవడం వల్లే నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నానని గర్వంగా చెప్పగలను. మాది సికింద్రాబాద్‌లోని వారాసీగూడ. మా నాన్న రైల్వేలో చిన్న ఉద్యోగి. నాకు ముగ్గురు అక్కచెల్లిళ్లు, ఒక తమ్ముడు. పెద్ద కుటుంబం కావడంతో మమ్మల్ని చదివించడం అమ్మానాన్నకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో తొమ్మిదో తరగతిలోనే నాకు మా బంధువుల అబ్బాయితో పెళ్లి చేశారు. నా భర్త ప్రోత్సాహంతో పదోతరగతి పూర్తిచేశాను. ఆ తర్వాత కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌లో చేరా. ఆ కాలేజీ వాతావరణం అమ్మాయిల భద్రతకూ అనుకూలమని మా వాళ్లు నిర్ధారించుకున్న తర్వాత నేనక్కడ దరఖాస్తు చేసేందుకు ఒప్పుకున్నారు. అలా 1985లో అక్కడ ‘డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగు’ కోర్సులో చేరాను. పాలిటెక్నిక్‌లో నేర్చుకున్న సబ్జెక్టు పునాదిగా  బీటెక్‌, ఎంటెక్‌ కూడా సులువుగా పూర్తిచేయగలిగాను. ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. ఆ కాలేజీలో చదవిన మరో వంద మంది ప్రస్తుతం మా శాఖలోనే వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ తదితర విభాగాల్లోనూ ఉన్నారు. కొన్ని వేలమంది అమ్మాయిలకు జీవితాన్ని ఇచ్చిన ఆ కాలేజీలో అరుదైన  కోర్సులను తీసేయడమంటే అమ్మాయిలను చదువుకు దూరం చేయడమే.

- దేశబోయిన రమ

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, తెలంగాణ నీటిపారుదల శాఖ





దళిత అమ్మాయిలకు అన్యాయం 

కమలానెహ్రూ పాలిటెక్నిక్‌లోని ఏడు కోర్సులూ వేటికవే ప్రత్యేకమైనవి. డిప్లొమా స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఇక్కడ తప్ప తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేదు. ఆర్కిటెక్చర్‌ డిప్లొమా కూడా అంతే.! గార్మెంట్‌ టెక్నాలజీ చదవాలంటే, లక్షల్లో ఖర్చు అవుతుంది. కమలానెహ్రూలో మాత్రం పన్నెండు వేల రూపాయలతో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయచ్చు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేనూ అదే కాలేజీలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చదివాను. వేలకువేలు ఫీజులు చెల్లించి ఇంటర్‌లో చేరలేని గ్రామీణ పేద బాలికలకు ఆ కాలేజీ పెద్ద అండ. అలాంటి ప్రతిష్టాత్మక కళాశాలలోని ఏడు అరుదైన ఎయిడెడ్‌ కోర్సులను తొలగించడం అంటే దళిత, బహుజన అమ్మాయిలకు అన్యాయం చేయడమే. ఆ స్థానంలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులు పెడుతున్నట్టు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. అదీ కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలివ్వలేమనే కారణంతో. లాభాపేక్షతో ఎయిడెడ్‌ కోర్సులను తీసేయడం అమానవీయం. మహిళా పాలిటెక్నిక్‌ కాలేజ్‌ని ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్వవిద్యార్థులమంతా వ్యతిరేకిస్తున్నాం.

- స్వాతి మణిపుత్రి, పూర్వవిద్యార్థిని





చదివిన కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేశా...

కమలానెహ్రూ పాలిటెక్నిక్‌లో 1976లో సివిల్‌ ఇంజినీరింగు డిప్లొమా చదివిన నేను, తర్వాత అదే కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశాను. అప్పట్లో అమ్మాయిలకు ఇంజినీరింగు విద్యలో అవకాశాలు అంతగా ఉండేవి కావు.  మా అన్నయ్య సలహాతో పాలిటెక్నిక్‌లో సివిల్‌ డిప్లొమాలో చేరాను. డిప్లొమాలో మొదటి ర్యాంకు సాధించడంతో ఎగ్జిబిషన్‌ సొసైటీవాళ్లు నన్ను బంగారు పతకంతో సత్కరించారు. తర్వాత అదే కాలేజీలో బోధకురాలిగా చేరాను. ప్రిన్సిపల్‌గా 2019లో రిటైర్‌ అయ్యాను. మా కాలేజీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ప్రతియేటా సీట్లన్నీ ఫుల్‌ అవుతాయి. ఇక్కడ చదివిన చాలామంది బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, బీఈఎల్‌, డీఆర్‌డీఎల్‌, ఇస్రో తదితర సంస్థల్లో శాస్త్రవేత్తలుగా ఉన్నారు. ఐటీరంగంలోనూ చాలామంది స్థిరపడ్డారు.

- తనికెళ్ల చంద్రకళ, విశ్రాంత ప్రిన్సిపల్‌





కేటీఆర్‌ మాటిచ్చినా...

పాలిసెట్‌ బుక్‌లెట్‌ నుంచి కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ ప్రవేశాలను ఈ ఏడాది తొలగించారు. అదీ ప్రభుత్వం ఎన్వోసీ జారీచేయకుండానే! ఎయిడెడ్‌ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే ఖాళీ పోస్టులను భర్తీచేసి, ప్రైవేటీకరణను ఆపేయాలి. ఈ విషయంపై కేటీఆర్‌ సైతం సానుకూలంగా స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీకి గౌరవ అధ్యక్షుడిగా తనను ఉండమని కమిటీ సభ్యులు అడుగుతున్నారు. ఆ కాలేజీని యథాతథంగా కొనసాగిస్తేనే అందుకు ఒప్పుకుంటానని ఎగ్జిబిషన్‌ సొసైటీవాళ్లకు కండీషన్‌ పెడతానని  మాతో చెప్పారు. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఇకనైనా ప్రభుత్వం మౌనం వీడాలి.

- సీహెచ్‌ ప్రమీల కన్వీనర్‌, 

కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్‌ పరిరక్షణ కమిటీ

Updated Date - 2021-07-26T06:05:39+05:30 IST