మిస్టరీగా ఏఎస్‌ఐ ఆత్మహత్య..!

ABN , First Publish Date - 2020-06-05T10:57:38+05:30 IST

కుప్పం ఏఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ ఆత్మహత్య మిస్టరీగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ..

మిస్టరీగా ఏఎస్‌ఐ ఆత్మహత్య..!

‘విధుల’ ఒత్తిడితోనే అంటూ బంధువుల ఆందోళన 

న్యాయం చేస్తామంటూ ఏఎస్పీ హామీ


కుప్పం, జూన్‌ 4: కుప్పం ఏఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ ఆత్మహత్య మిస్టరీగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు. కుప్పం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్‌, పట్టణంలోని పాతపేట గాండ్లవీధిలోని అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంగారుపాళ్యం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న ఆయన కుమారుడు ప్రకాష్‌తోపాటు బంధువులు చిత్తూరు నుంచి రాత్రికి రాత్రే కుప్పం చేరుకున్నారు. సంఘటనా స్థలం వద్ద అర్ధరాత్రి దాటేదాకా పోలీసులకు, బంధువర్గాలకు మధ్య ఏఎస్‌ఐ మృతిపై వాదోపవాదాలు జరిగాయి. కుప్పం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించాక గురువారం ఉదయం కూడా బంధువులు వాదనకు దిగారు.


ఏఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ ఎంతో సౌమ్యుడని, ఆయనకు, ఆయన కుటుంబానికి శత్రువులుకానీ, ఆర్థిక ఇబ్బందులుకానీ లేవన్నారు. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయి సుమారు 20 రోజులు దాటుతున్నా ఆయన్ను రిలీవ్‌ చేయకుండా కుప్పంలోనే కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.  ఆత్మీయులకు ఫోన్‌చేసి ఒత్తిళ్లు, విధుల కేటాయింపు, రిలీవ్‌ చేయకపోవడం వంటి అంశాలపై తన వేదనను తరచూ పంచుకునేవారని గుర్తుచేశారు. న్యాయం చేస్తామ ని ఏఎస్పీ మహేష్‌ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఏఎస్‌ఐ ఆత్మహత్య వెనుక విధి నిర్వహణకు సంబంధించిన ఒత్తిళ్లేమైనా పనిచేశాయా అన్న మీడియా ప్రశ్నకు ఏఎస్పీ మహేష్‌, డీఎస్పీ ఆరీఫుల్లా స్పందిస్తూ పోలీసు ఉద్యోగమంటేనే ఒత్తిళ్లు ఉంటాయని, వాటిని తట్టుకుని విధులు నిర్వహించడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-05T10:57:38+05:30 IST