ఆ..శ్రమ తప్పదా?

ABN , First Publish Date - 2020-08-07T10:31:18+05:30 IST

ఓవైపు ప్రభుత్వం సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఆ..శ్రమ తప్పదా?

కరోనా కాలంలో నిర్వహణ ఎలా..?

వందల సంఖ్యలో పిల్లలు

బంకుర్‌ బెడ్స్‌లో దగ్గరగా వసతి

ఆశ్రమ పాఠశాలలపై అధికారుల్లో కలవరం

మెనూ అమలు అంతంతమాత్రమే


‘భౌతిక దూరం పాటించండి. కరోనాకు దూరంగా ఉండండి... అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు’ అంటూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం పాఠశాలలు తెరిచేందుకు సిద్ధమవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. రోజురోజుకూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల రోజుల్లో కరోనా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి పాఠశాలలు తెరవడం ఎలా? అనేది ఉపాధ్యాయులను...అధికారులను కలవర పెడుతున్న ప్రశ్న. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల విషయంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు.


(పార్వతీపురం): ఓవైపు ప్రభుత్వం సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. సాధారణ పాఠశాలల సంగతి పక్కన పెడితే... గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల నిర్వహణ ఎలా అన్నది అధికారులకు పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న పరిస్థితిలో పాఠశాలలు తిరిగి తెరుచుకొనేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసేసింది. విద్యా సంవత్సరం పునః ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. అంతా సవ్యంగా జరిగితే ఫర్వాలేదు. పొరపాటున పిల్లలపై కరోనా వైరస్‌ ప్రభావం పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.


ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పక్కాగా అమలు జరగడం లేదన్నది యంత్రాంగానికి తెలియంది కాదు. పౌష్టికాహారం మొక్కుబడిగా అందజేయడంతో విద్యార్థులు తరచూ జ్వరాల బారిన పడడం చూస్తున్నాం. జ్వరాల తీవ్రతతో   చిన్నారులు మృతి చెందిన సంఘటనలూ లేకపోలేదు. ఎవరైనా పిల్లలు జ్వరంతో బాధపడితే వారిని సిక్‌ రూములో ఉంచకుండా ఇళ్లకు పంపించే పరిస్థితి అనేక ఆశ్రమ పాఠశాలల్లో ఉంది. కరోనా వైరస్‌ ప్రబలితే ఏం చేస్తారు? అసలు ముందే ఎలా గుర్తిస్తారు? వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్నది ఉపాధ్యాయ సిబ్బందిని వేధిస్తున్న ప్రశ్న. పిల్లలకు వైరస్‌ సోకితే ఉపాధ్యాయులకు, వార్డెన్లకు కలవరమే. ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వందల సంఖ్యలో పిల్లలు

జిల్లాలోని 55 ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 13 వేలకు పైబడి విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలలో కూడా కనీసం వంద మంది పిల్లలకు తక్కువగా ఉండరు. కొన్నిచోట్ల 250 మంది వరకూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో పిల్లలున్న ఆశ్రమ పాఠశాలల్లో వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలతో పాటు ముందుచూపుతో కూడిన ప్రణాళికలు వేసుకోవాలి. దీనిపై ఇప్పటివరకూ ఏ ప్రకటనా రాలేదు.  


దగ్గరగా బంకుర్‌ బెడ్స్‌

 ఆశ్రమ పాఠశాలల్లో బంకుర్‌ బెడ్స్‌ ఉన్నాయి. వీటిపైనే పిల్లలు నిద్రపోతారు. ఒక్కో బెడ్‌పై నలుగురు(పైన ఇద్దరు.. కింద ఇద్దరు) నిద్రపోతారు. బెడ్స్‌ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. సెంటీమీటర్‌ ఖాళీ కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో భౌతికదూరం ఎలా పాటిస్తారు? కరోనా కబళించకుండా ఏం చర్యలు తీసుకుంటారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. భౌతిక దూరం పాటించే ంత విశాలమైన గదులు ఎక్కడా లేవు. మరోవైపు ఉపాధ్యాయులు ఇళ్ల వద్ద నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడి ద్వారానైనా కరోనా వైరస్‌ ఆశ్రమ పాఠశాలలో ప్రబలిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలు తెరవడంపై యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-08-07T10:31:18+05:30 IST