భారతీయ ఆయుర్వేద వైద్యంలో గర్భసంబంధ సమస్యలకు అశోకారిష్ట ఉపయోగకరమైనదని చెప్పడం జరిగింది. ఈ మందు తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన బైషజ్య రత్నావళి గ్రంథంలోని స్త్రీరోగ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అలాగే ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఆఫ్ ఇండియాలో కూడా పేర్కొనడం జరిగింది.
దీనిలో ఉపయోగించే ప్రధాన మూలిక అశోక చెట్టు బెరడు. అశోక చెట్టును సీత అశోక అని కూడా అంటారు. దీని ఆకులు మామిడి ఆకులను పోలి ఉంటాయి. గుబురుగా ఎదిగిన చెట్టు మామిడి చెట్టును తలపిస్తుంది. దీని శాస్త్రీయ నామం సారక అశోక. అశోక బెరడుతో పాటు చందనం, తుంగమస్తల, వస, దారు హరిద్ర, త్రిఫల, నల్లజీరా వంటి 15 మూలికలతో కలిపి, అరిష్ట విధానంలో ఔషధం తయారుచేస్తారు. ఈ మందు తయారీలో మామిడి బెరడును కూడా ఉపయోగిస్తారు.
అశోకారిష్ట ఉపయోగాలు: నెలసరి ముందుగా లేదా ఆలస్యంగా వచ్చే సమస్యలకూ, హార్మోన్ల అసమతౌల్యానికీ, నెలసరి నొప్పులకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. నెలసరి నొప్పులకు అశోకారిష్ట మహాయోగరాజగుగ్గులు రెండూ కలిపి వాడడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. మహిళలు అశోకారిష్టను ఆరునెలల పాటు క్రమం తప్పక వాడితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.
ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మిల్లీలీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్, బైద్యనాద్, వైద్యరత్న, డాబర్ వంటి ఆయుర్వేద ఔషధ సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
- శశిధర్,
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,
సనాతన జీవన్‌ట్రస్ట్, కొత్తపేట, చీరాల