Ashok Gehlot: నా చేతుల్లో ఏమీ లేదు.. అశోక్‌ గహ్లోత్‌ అంత మాట అనేశారేంటి..!

ABN , First Publish Date - 2022-09-26T16:27:42+05:30 IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో (Rajasthan Political Crisis) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ (CM Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం తలెత్తిన..

Ashok Gehlot: నా చేతుల్లో ఏమీ లేదు.. అశోక్‌ గహ్లోత్‌ అంత మాట అనేశారేంటి..!

జైపూర్: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో (Rajasthan Political Crisis) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ (CM Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం తలెత్తిన సంక్షిష్ట పరిస్థితులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం అశోక్ గహ్లోత్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ‘నా చేతుల్లో ఏమీ లేదు’ అని వేణుగోపాల్‌కు అశోక్ గహ్లోత్ తేల్చి చెప్పినట్లు సమాచారం. 40 ఏళ్లుగా తాను అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగానని, కొత్త తరానికి కూడా అవకాశం దక్కాలని గహ్లోత్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సచిన్ పైలట్‌ను (Sachin Pilot) ముఖ్యమంత్రిని చేయాలన్న అధిష్ఠానం నిర్ణయం పట్ల తాను అసంతృప్తితో లేననే సంకేతాలను తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో గహ్లోత్ ఇచ్చినట్టయింది. అయితే.. అశోక్ గహ్లోత్ వర్గం మాత్రం సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై కారాలుమిరియాలు నూరింది. తమకు ఈ నిర్ణయం ఏమాత్రం నచ్చలేదంటూ అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీకి ఆదివారం రాత్రి రాజీనామా లేఖలను పంపించారు.



ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పులకు కారణమయ్యాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనుండటంతో అధిష్ఠానం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని స్పష్టం చేసింది. దీంతో.. గహ్లోత్ స్థానంలో ఎవరిని సీఎంను చేయాలనే అంశం రాజస్థాన్ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. తాను ముఖ్యమంత్రి కావాలని సచిన్ పైలట్ భావిస్తుండగా.. అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. అయితే.. సచిన్ పైలట్ గతంలో తిరుగుబాటు ప్రకటించి పార్టీని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని అశోక్ గహ్లోత్ వర్గం బలంగా వాదిస్తోంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా అశోక్ గహ్లోత్ వర్గం మాత్రం ఒక బలమైన సంకేతాన్ని అధిష్ఠానానికి పంపినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



2020లో తిరుగుబాటు చేసిన పైలట్‌ను గానీ, అతని వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినైనా గానీ ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్ఠానం ఎంచుకుంటే గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించినట్లయింది. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 108. ఆదివారం రాత్రి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 83 నుంచి 92 మధ్య ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. అశోక్ గహ్లోత్ వర్గం ఇది ఇప్పటికిప్పుడు చేసిన తిరుగుబాటు కాదని.. ఇది ఫిక్డ్స్‌ మ్యాచ్ ఏమోనన్న అనుమానాలు అక్కడి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతర వ్యక్తి ఉండాలనే డిమాండ్ కాంగ్రెస్‌లో బలంగా వినిపించిన నేపథ్యంలో పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తికే ఆ అవకాశం దక్కుతుందని అశోక్ గహ్లోత్ వర్గం ముందుగానే అంచనా వేసిందని.. ఆ ప్రకారం చూసుకుంటే గహ్లోత్‌ రేసులో నిలవడం ఖాయం అని ఆయన వర్గానికి క్లారిటీ ఉందని టాక్. అందువల్ల.. అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎంని చేయాలన్న ఆలోచన చేస్తుందని ముందుగానే భావించిన అశోక్ గహ్లోత్ వర్గం మూకుమ్మడి రాజీనామాలు చేసి షాకిచ్చిందనేది రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఏదేమైనా.. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటే రాష్ట్రాల్లో ఆ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు మాత్రం ఆ పార్టీని గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Updated Date - 2022-09-26T16:27:42+05:30 IST