రామాలయం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తునకు అశోక్ గెహ్లాట్ డిమాండ్

ABN , First Publish Date - 2021-06-15T17:47:51+05:30 IST

అయోధ్య రామాలయం నిర్మాణానికి సేకరించిన విరాళాలు దుర్వినియోగమైనట్లు

రామాలయం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తునకు అశోక్ గెహ్లాట్ డిమాండ్

జైపూర్ : అయోధ్య రామాలయం నిర్మాణానికి సేకరించిన విరాళాలు దుర్వినియోగమైనట్లు వార్తలు రావడంతో ప్రజల విశ్వాసం కంపించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


అశోక్ గెహ్లాట్ మంగళవారం ఇచ్చిన వరుస ట్వీట్లలో, అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం రాజస్థానీలు అత్యధిక విరాళాలు ఇచ్చారన్నారు. రామాలయం నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు భక్తులను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. 


రాజస్థానీలు ఎంతో భక్తితో విరాళాలు ఇచ్చారని, రామాలయం నిర్మాణం ప్రారంభంలోనే నిధుల దుర్వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణలు సామాన్యులను దిగ్భాంతికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. భూమి విలువ కొద్ది నిమిషాల్లోనే రూ.2 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరగడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని తెలిపారు. 


రాష్ట్రంలోని బన్షీ పహర్‌పూర్‌లో చట్టవిరుద్ధంగా గనులను తవ్వి, పింక్ స్టోన్‌ను తీసి, రామాలయం నిర్మాణానికి పంపించారని, దానికి చట్టబద్ధమైన పద్ధతిలో చట్టబద్ధతను పొందారని, దాని పట్ల తాము సంతృప్తి చెందామని అన్నారు. 


రామాలయం నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్టు అనైతిక ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడటం దేశవ్యాప్తంగా భక్తులను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. రామాలయ నిర్మాణం వంటి పవిత్రమైన కార్యక్రమంలో సైతం కుంభకోణాలకు పాల్పడటాన్ని ఎవరూ ఊహించలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై దర్యాప్తు జరిపించి, దేశ ప్రజల విశ్వాసంతో ఆడుకుంటున్న దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసం, నమ్మకం కొనసాగేలా చూడాలన్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ నేత ఆరోపణలతో వివాదం ప్రారంభం

సమాజ్‌వాదీ పార్టీ నేత తేజ్ నారాయణ్ పాండే ఆదివారం విలేకర్ల సమావేశంలో చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో శ్రీరామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ట్రస్టు ఓ భూమిని రూ.18.5 కోట్లకు మార్చి 18న కొనుగోలు చేసిందని, అంతకు 10 నిమిషాల ముందు అదే భూమిని రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ రూ.2 కోట్లకు కొన్నారని తెలిపారు. ఈ ట్రస్టు ఆర్‌టీజీఎస్ ద్వారా రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ బ్యాంకు ఖాతాకు రూ.17 కోట్లు పంపించిందని చెప్పారు. ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్‌పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. 


ఈ ఆరోపణలను శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖండించింది. ఈ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ, ఇవన్నీ తప్పుదోవ పట్టించే, రాజకీయ విద్వేషంతో కూడిన ఆరోపణలని చెప్పారు. 


Updated Date - 2021-06-15T17:47:51+05:30 IST