విజయనగరం: మాజీమంత్రి అశోక్ గజపతిరాజు చేయి చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ కార్యకర్త హేమలత కొట్టిపారేశారు. హేమలత మీడియాతో మాట్లాడుతూ అశోక్‌గజపతిరాజు తనకు తండ్రి సమానులని చెప్పారు. అభిమానంతో పదే పదే పూలు చల్లానని, అలా వద్దని వారించటానికి తన చేతిలో ఉన్న ప్లేటుపై అశోక్‌గజపతిరాజు కొట్టారని తెలిపారు. ఈ ఘటనను కొంత మంది రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారని హేమలత తప్పుబట్టారు.
విజయనగరంలోని పూల్‌బాగ్‌లో టీడీపీ కార్యకర్తతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి వస్తున్న అశోక్‌గజపతిరాజుకు భారీ స్వాగత సన్నాహాకాలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. కొన్ని బంతిపూలు ఆయన కంటికి తగిలాయి. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. మహిళ తనపై కావాలనే పూలు చల్లిందని, ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయన చేయిచేసుకోవడంపై కార్యకర్తలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.