Apr 8 2021 @ 20:16PM

‘రౌడీ బాయ్స్‌‌’తో హీరోగా వస్తోన్న దిల్‌ రాజు వారసుడు

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా దిల్‌ రాజు, ఆయన సోదరుడు శిరీష్‌ల ప్రస్థానం తెలియంది కాదు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వారు ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అందిస్తున్నారు. ఇప్పుడా ఫ్యామిలీ నుంచి ఓ హీరో అంటే.. దిల్ రాజు, శిరీష్ ల వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. దిల్‌రాజు సోదరుడు.. నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి‌. ఆయన కథానాయకుడిగా పరిచయం కాబోతోన్న చిత్రం 'రౌడీ బాయ్స్‌'. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. కాలేజీ కుర్రాళ్లు, కాలేజీ జీవితం ఎలా ఉంటుందనే విషయాల బ్యాక్‌డ్రాప్‌తో 'రౌడీ బాయ్స్‌' తెరకెక్కినట్లు మోషన్‌ పోస్టర్‌తో రివీల్ అయ్యింది.  

'రౌడీ బాయ్స్‌' టైటిల్‌ యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉందనే.. ఇటీవల సందీప్‌ కిషన్‌ సినిమాకి 'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను కూడా మార్పించారు. ఇక మోషన్‌ పోస్టర్‌లోని సాంగ్‌, అందులోని సీన్స్‌ చూస్తే ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆశిష్‌ బి.టెక్‌ స్టూడెంట్‌ పాత్రను పోషిస్తున్నారు. బి.టెక్‌ స్టూడెంట్‌ అయిన హీరో, మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్‌ అయిన అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇంట్రడక్షన్‌ ర్యాప్‌ వీడియో సాంగ్‌ను రోల్‌ రైడా చేశాడు. ఈ సాంగ్‌ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను 'హుషారు' ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 'రౌడీ బాయ్స్‌' చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌ 25న విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.