డ్యూటీ.. ఆమె ప్రాణం

ABN , First Publish Date - 2022-01-27T16:41:02+05:30 IST

కరోనా మొదటి దశ ఆ ఇంటి పెద్ద దిక్కును మింగేసింది. దీంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ధైర్యంగా ముందడుగు వేస్తోందామె. తన పరిధిలో ఆపద అని ఏ రాత్రి ఎవరు...

డ్యూటీ.. ఆమె ప్రాణం

ఆశావర్కర్‌ సేవలకు సెల్యూట్‌

హైదరాబాద్/రాంనగర్‌:  కరోనా మొదటి దశ ఆ ఇంటి పెద్ద దిక్కును మింగేసింది. దీంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ధైర్యంగా ముందడుగు వేస్తోందామె. తన పరిధిలో ఆపద అని ఏ రాత్రి ఎవరు ఫోన్‌ చేసినా వారిని స్థానిక ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలు అందేలా చేస్తోంది. ఆమె సేవలను వైద్యాధికారులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. అంబర్‌పేట కుమ్మరివాడలో నివసిస్తున్న గీతశ్రీ తిలక్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఇంటి పెద్ద కొవిడ్‌తో మృతి చెందారు. ఆమెకు కుమార్తె (హారిక) 8వ తరగతి చదువుతోంది. గీతశ్రీని వైద్యాధికారి డాక్టర్‌ కాలేరు దీప్తి పాటిల్‌ కుమ్మరివాడ బస్తీకి ఆశావర్కర్‌గా నియమించారు. బస్తీలోని 400 కుటుంబాలలోని వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ తెలుసుకుంటూ కావాల్సిన మందులను ఇస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళనలను పోగొడుతూ, జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేస్తున్నారు.


గర్బిణి కోసం రాత్రి కూడా..

బస్తీకి చెందిన స్వరూప బుధవారం అంబర్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. రాత్రి ఆమెకు బీపీ, షుగర్‌, బాబుకు ఫీడింగ్‌ ఇబ్బందులు ఎదురుకావడంతో గీతశ్రీ దగ్గరుండి పర్యవేక్షించారు. డ్యూటీ వేళలు కాకపోయినా రాత్రి కూడా ఆస్పత్రికి వచ్చి ఆమెకు సేవలు అందించడం చూసి వైద్యాధికారి డాక్టర్‌ కాలేరు దీప్తి పాటిల్‌, జిల్లా స్థాయి అధికారులు గీతశ్రీని అభినందించారు. ఈ సందర్భంగా గీతశ్రీ మాట్లాడుతూ డ్యూటీ అంటే తనకు ప్రాణమని చెప్పారు. గీతశ్రీ కమిటెడ్‌ ఆశావర్కర్‌ అని దీప్తి పాటిల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-27T16:41:02+05:30 IST