‘ఆశా’లకు కనీస వేతనాలివ్వాలి

ABN , First Publish Date - 2021-07-02T06:27:35+05:30 IST

ఆశా... ఆశా... అందరూ ఆధారపడుతోంది వారి మీదే. అనారోగ్యం వస్తే ముందుగా వచ్చి ప్రజలను పరామర్శించేది ఆశా కార్యకర్తలే. కరోనా పాజిటివ్‌ అంటేనే అందరూ భయపడిపోతున్నా వారు...

‘ఆశా’లకు కనీస వేతనాలివ్వాలి

ఆశా... ఆశా... అందరూ ఆధారపడుతోంది వారి మీదే. అనారోగ్యం వస్తే ముందుగా వచ్చి ప్రజలను పరామర్శించేది ఆశా కార్యకర్తలే. కరోనా పాజిటివ్‌ అంటేనే అందరూ భయపడిపోతున్నా వారు మాత్రం ప్రాణాలకు తెగించి ప్రజాసేవలో ముందు వరుసలో నిలబడి విధి నిర్వహణలో తలకు మించిన భారాన్ని మోస్తున్నారు. ఒకవైపు గర్భిణులకు సేవలు, మరోవైపు కరోనా రోగుల బాగోగులు, కరోనా టీకాలు ఇప్పించడం, ఫీవర్‌ సర్వేలు.. ఇలా అన్నీ వారే చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా ముందు పిలిపించేది ఆశా కార్యకర్తలనే. అయితే వారు చేసే శ్రమకు, లభించే ప్రతిఫలానికి పొంతన లేదు. శాశ్వత ఉద్యోగులు చేయాల్సిన పనులు ఆశా కార్యకర్తలు చేస్తున్నా సరైన గుర్తింపు లేక గౌరవ వేతనం పేరిట శ్రమ దోపిడీకి గురవుతున్నారు.


నైపుణ్యం లేని కార్మికులకు కూడా ప్రభుత్వం ఆశా కార్మికుల కంటే ఎక్కువ వేతనం ఇస్తోంది. వీరికి మాత్రం కనీస వేతనం లేదు. ప్రతి ఆశా కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ నిరంతరం ప్రజల ఆరోగ్య పరిస్థితుల్ని వాకబు చేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ అందరికీ అండగా నిలుస్తున్నారు. తమకు కనీస వేతనాలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఎప్పటినుంచో ఆందోళనలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కాలంలో వారు అందిస్తున్న విశిష్ట సేవలనైనా గుర్తించి ప్రత్యేకంగా ఎలాంటి పారితోషికాలు కూడ ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఎస్‌. శంకరాంజినేయులు, అనంతపురం

Updated Date - 2021-07-02T06:27:35+05:30 IST