TMC: పార్థ ఛటర్జీని చూసి సిగ్గుపడుతున్నాం..కానీ అందరూ దొంగలు కాదు..!

ABN , First Publish Date - 2022-08-10T23:19:51+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్‌(TMC)కు చెందిన 19 మంది నేతలు, మంత్రుల ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయంటూ..

TMC: పార్థ ఛటర్జీని చూసి సిగ్గుపడుతున్నాం..కానీ అందరూ దొంగలు కాదు..!

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌(TMC)కు చెందిన 19 మంది నేతలు, మంత్రుల ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయంటూ రెండ్రోజుల క్రితం దాఖలైన ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (PIL)పై ఆ పార్టీ నేతలు స్పందించారు. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పాక్షిక సత్యమేనని అన్నారు. పిల్‌లో పేర్లు ఉన్న 19 మందిలో ఐదుగురు నేతలు-ఫిర్వాద్ హకిం, బ్రత్య బసు, అరూప్ రాయ్, షియూలి సహా, ఘటక్‌లు బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు.


''ప్రజా సేవ కోసం వ్యక్తిగత సంతోషాలను కూడా మేము త్యాగం చేశాం. ప్రజల కోసం మమతా బెనర్జీతో కలిసి పోరాడాం. కానీ, కొందరు రాజకీయ దురుద్దేశాలతో నిరంతరం అవమానాలకు గురిచేస్తున్నారు'' అని ఫిర్వాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్థా ఛటర్జీ చేసిన పనికి అందరూ సిగ్గుపడుతున్నామని, అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్‌లో అందరూ దొంగలని చెప్పడం సరికాదని అన్నారు. తనకు ఫ్యామిలీ  బిజినెస్ ఉందని, ఆస్తుల సమాచారంపై ఎలాంటి దాపరికాలు లేవని చెప్పారు. తమపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్ధసత్యాలేనని, సీపీఎం, కాంగ్రెస్‌కు చెందిన పలువురు లీడర్లకు కూడా ఈ పీల్‌లో ప్రమేయం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలు పెరగడం, ఆస్తులు కొనుక్కోవడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ప్రెస్‌మీట్‌పై బీజేపీ నాయకత్వం ఆచితూచి స్పందించింది. కోర్టులో ఈ వ్యవహారం ఉన్నందున తాము ఎలాంటి కామెంట్లు చేసేది లేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-10T23:19:51+05:30 IST