Amaravathi: అసాని (Asani) తుఫాన్ కృష్ణా జిల్లా కృత్తివెన్ను దగ్గర నర్సిపట్నం-నరసాపురం మధ్య తీరం దాటిందని భారత వాతావరణశాఖ తెలిపింది. తీరందాటే సమయంలో గంటకు 55 నుంచి 65.. అప్పుడప్పుడు 75 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచాయి. మచిలీపట్నం, నరసాపురం సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తీరం దాటిన తీవ్రవాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం కాకినాడ వద్ద సముద్రంలో కలిసే అవకాశముందని వెల్లడించింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కృష్ణా ఉభయగోదావరి జిల్లాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కళింగపట్నం నుంచి ఓడరేవు వరకు గల అన్ని ప్రధాన పోర్టుల్లో 7వ నెంబర్, కృష్ణ పట్నంలో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. అసాని తుఫాన్ తీరం దాటడంపై భారత వాతావరణశాఖ బుధవారం రాత్రి తొలిసారి ప్రకటన చేసింది. తుఫాన్‌గా ఏర్పడకముందు ఉత్తర కోస్తాకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని తీరానికి సమాంతరంగా ఒడిషావైపు వెళుతుందని ప్రకటించింది.