Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 24 May 2022 23:30:04 IST

రైతులకు శాపంగా ‘అసాని’

twitter-iconwatsapp-iconfb-icon

సగానికి పడిపోయిన దిగుబడి

దిక్కుతోచని స్థితిలో వరి రైతులు 

ప్రభుత్వ కొనుగోళ్లు శూన్యం


ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగు చేసిన పంట చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తే తీరా చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి పంట చేతికందక రైతుకు కన్నీరే మిగులుతోంది. గతంలో నష్టాలపాలైన రైతన్నలు ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పంటలు సాగు చేస్తూ నష్టపోతూనే ఉన్నారు. గత నెలలో కురిసిన అసాని తుఫాన్‌ ప్రభావంతో వరి పంట భారీగా నష్టపోయారు. వచ్చిన అరకొర దిగుబడిని కూడా కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.  


చిన్నమండెం, మే 24: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అసాని తుఫాన్‌ దెబ్బతీసింది. వర్షాలతో వరి అంతా పడిపోవడంతో దిగుబడిలో సగం కూడా చేతికి రాలేదు. వచ్చిన అరొకర ధాన్యాన్ని అమ్ముకోవాలనుకుంటే అడిగే నాథుడే లేడు. రైతుల ప్రభుత్వంగా చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతు ఇన్ని కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలతో పూర్తిగా నష్టపోయిన అన్నదాత నీరు పుష్కలంగా ఉండడంతో రబీ సీజన్‌లోనైనా తమకు ఆశించిన మేర దిగుబడులు వస్తాయని భావించి సాగు చేశారు. అయితే దుక్కి చేసే ట్రాక్టర్లు, కూలీలు, క్రిమిసంహారక మందులు, ఎరువులతో దాదాపు ఎకరాకు 25- 30 వేల రూపాయలు పెట్టుబడి వచ్చింది. అన్నదాత ఆశించిన మేర దిగుబడులు వచ్చినప్పటికీ అకాల వర్షంతో చేతికందిన పంట సగానికిపైగా నేలపాలైంది. దీనికితోడు వరి యంత్రాలు గంటకు రూ.2,800 వసూలు చేస్తున్నారు. వీరిని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వీరు చెప్పిందే రేటు అన్నట్లు సాగుతోంది.


దళారుల దందా

ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వడ్లు అడిగే నాథుడే లేడంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో వడ్లు 19.60 రూపాయలు ప్రకటించింది. అంటే దాదాపు ఒక బస్తా రేటు రూ.1500గా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు నాణ్యతను బట్టి రూ.1150-1200 వరకు రేటు చెబుతున్నారు. కనీసం ఆ రేటుకైనా అమ్మి తెచ్చిన అప్పులు ఇవ్వాలనుకున్నా కొనే నాథుడే లేడు.


వరి గడ్డి నేలపాలు

కనీసం దిగుబడి అంతంతమాత్రం వచ్చినా పశువులకు గడ్డితో ఇబ్బంది రాకూడదని చాలా మంది రైతులు రబీ సీజన్‌లో వరి సాగు చేశారు. అయితే వీరి ఆశలపై వరుణదేవుడు అసాని రూపంలో తన ప్రతాపాన్ని చూపాడు. గడ్డి మొత్తం వర్షానికి కుళ్లిపోవడంతో అంది ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీంతో పశువులకు ట్రాక్టర్‌ వరి గడ్డిని దాదాపు 8 వేల నుంచి 10 వేల రూపాయలు పలుకుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఆర్‌బీకేల్లో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి

- రామాంజనేయాచారి, ఏవో 

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలో 19.60 రూపాయలు. అయితే రైతులు ఆర్‌బీకే సెంటర్ల వద్ద రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే తాము ప్రభుత్వానికి పంపుతాము. ఆ తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తాము. మండల వ్యాప్తంగా 675 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ఈ-క్రాప్‌ చేయించుకున్నారు. 


రెండు ఎకరాల్లో వరి సాగు చేశా

- రెడ్డికుమార్‌, రైతు, కురవపల్లె.

రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. దాదాపు 70 బస్తాలపైన దిగుబడి వస్తుందని అంచనా వేశాం. అయితే అకాల వర్షంతో 38 బస్తాలు అయ్యాయి. వాటిని కూడా కనీసం కొనే దిక్కులేక వ్యాపారస్తులను అడుక్కొని ఇచ్చాం. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల వద్ద వడ్లు ఉన్నా ఎవ్వరూ కొనడానికి రావడం లేదు. 

రైతులకు శాపంగా అసానికురవపల్లెలో వడ్లను బస్తాలకు నింపుతున్న కూలీలు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.