అసామాన్యుడు

ABN , First Publish Date - 2020-04-10T08:27:53+05:30 IST

ప్రేమించేవారి వలె విద్వేషించేవారు, గౌరవించేవారి వలె తిరస్కరించేవారు, భూషించేవారి వలె దూషించేవారు ఒకే వ్యక్తికి విశేష సంఖ్యలో ఉంటే, అతడు నిశ్చయంగా ...

అసామాన్యుడు

ప్రేమించేవారి వలె విద్వేషించేవారు, గౌరవించేవారి వలె తిరస్కరించేవారు, భూషించేవారి వలె దూషించేవారు ఒకే వ్యక్తికి విశేష సంఖ్యలో ఉంటే, అతడు నిశ్చయంగా అసామాన్యుడే. నవ భారత నాయకులలో ఇట్టి ఒక అసాధారణ వ్యక్తి డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. 


ఇంతేకాక, డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని గురించి, భావాలను గురించి, ఉద్యమాలను గురించి, వాటి సాఫల్య వైఫల్యాలను గురించి, నిష్పాక్షికంగా ఆలోచించటానికి కొంతకాలంగా కృషి జరుగుతుంది. ఇందుకు ఒక సరికొత్త నిదర్శనం ‘అంబేద్కర్: ఎ క్రిటికల్ స్టడీ’ అనే గ్రంథం. దీని రచయిత డాక్టర్ డబ్ల్యు ఎన్ కుబేర్. కుబేర్ వివరిస్తున్నట్టు అంబేద్కర్ జీవితం ఎంత ముఖ్యమైనదో ఆయన చింతన అంత ముఖ్యమైనది. కొన్ని విధాల ఆయన చింతనే మరింత ముఖ్యమైనది. అంబేద్కర్‌ను మించిన మేధావులు ఉండవచ్చు కాని నిర్భీతిగా ఆలోచించడంలో, ఆలోచించినదాన్ని నిర్భీకంగా వెల్లడించడంలో ఆయనను మించగలవారు లేరు. లోకంలో తనను ఎంతగా అపార్థం చేసుకున్నా, ఎంతగా ఆడిపోసుకున్నా ఎంతగా హింసించినా ఎంతమాత్రం సంచలించక తన ఆలోచనలను వెల్లడించగలవాడే నిజమైన మేధావి. అంబేద్కర్ వలె ‘మేధావి’ అనే ప్రశంసకు తగినవారు నవ భారతంలో బహుశా పట్టుమని పదిమంది కూడా లేరేమో!


అంబేద్కర్ వంటి పండితులుండవచ్చు. కాని, ఆ పాండిత్య వైవిధ్యంలో ఆయనను మించగలవారు లేరు. ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలైన పెక్కింటిలో ఆయన ప్రథమ శ్రేణికి చెందినవారు. మేధావులైన వారు, పండితులైన వారు ప్రజానాయకులుగా రాణించడం చాలా అరుదు. నవ భారత నాయకులలో అంబేద్కర్ స్థానం గాంధీ, జిన్నాల స్థానం తర్వాత. వారిద్దరిలో కానరాని ఒక ప్రత్యేక విశేషం అంబేద్కర్‌లో ఉండేది. అది ఆయన ఆధునిక దృష్టి. ఆధునికత్వం ప్రాతిపదికగా ఒక జీవిత విధానాన్ని రూపొందించడానికి ఆయన ప్రయత్నించారు. 

1973 మే 14 ఆంధ్రజ్యోతి సంపాదకీయం ‘అంబేద్కర్’ నుంచి

Updated Date - 2020-04-10T08:27:53+05:30 IST