నాపై దాడి అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా...ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ABN , First Publish Date - 2022-02-04T14:43:48+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై జరిగిన కాల్పుల ఘటన అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు...

నాపై దాడి అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా...ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై జరిగిన కాల్పుల ఘటన అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి ప్రస్థావించేందుకు తనకు సమయం కేటాయించాలని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోక్‌సభ స్పీకరును కలిసి కోరనున్నారు. ఒవైసీపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా తమ మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తామని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ చెప్పారు.అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎంఐఎం సభ్యులు ఆయా నగరాల పోలీసు కమీషనర్లకు మెమోరాండం సమర్పించనున్నట్టు ఎంపీ తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లో  ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి అత్యున్నత భద్రత కల్పించాలని ఎంపీ జలీల్ కోరారు.ఏఐఎంఐఎం అధినేతపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద నల్లజెండాను ఎగురవేశారు.చార్మినార్ వద్ద దుకాణ యజమానులు నిరసన చిహ్నంగా తమ దుకాణాలను మూసివేశారు.యూపీలో ఏఐఎంఐఎం చీఫ్‌పై దాడి జరిగిన తర్వాత హైదరాబాద్‌లోని సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గస్తీని ముమ్మరం చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 


ఓ మసీదులో ఒవైసీ క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.ఒవైసీ సోదరుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (ఒవైసీ బంధువు) ఢిల్లీ చేరుకుని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు.


Updated Date - 2022-02-04T14:43:48+05:30 IST