బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ పార్లమెంటుసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై యూపీలోని బారాబంకి పోలీసులు కేసు నమోదు చేశారు. బారాబంకీ జిల్లాలో అసదుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినందుకు పోలీసులు కేసు పెట్టారు. బారాబంకీలో 100 సంవత్సరాల పురాతన మసీదును కూల్చివేశారని, ఈ వ్యవహారంలో పాలకులను ఎంపీ నిందించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా మాట్లాడని ప్రతిపక్ష పార్టీలను అసద్ విమర్శించారు.
మతసామరస్యానికి విఘాతం వాటిల్లేలా రెచ్చగొట్టేలా ప్రసంగించడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అసదుద్దీన్ ఒవైసీ అసభ్య పదజాలం ఉపయోగించారని పోలీసులు ఆరోపించారు.కొవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు ఎపిడెమిక్ వ్యాధుల చట్టంలోని సంబంధిత సెక్షన్లు, సమావేశానికి సంబంధించిన షరతులతో పాటు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153ఎ, 188, 169, 170 కింద గురువారం రాత్రి ఒవైసీని బుక్ చేసినట్లు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు.బారాబంకి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఒవైసీ రామ్‌సనేహి ఘాట్‌లోని మసీదు గురించి ప్రస్థావించారు.