అసద్‌.. ఓ ఉన్మాది, మూర్ఖుడు: సంజయ్‌

ABN , First Publish Date - 2020-04-05T08:44:57+05:30 IST

మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మతమౌఢ్యం తలకెక్కిన ఓ ఉన్మాది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. భౌతికదాడులు జరుగుతున్నా కరోనా బాధితులకు...

అసద్‌.. ఓ ఉన్మాది, మూర్ఖుడు: సంజయ్‌

  • దీపం వెలిగిస్తే జ్ఞానం వస్తుందని హితవు
  • మత రాజకీయాలు మానుకోవాలి: అరుణ

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మతమౌఢ్యం తలకెక్కిన ఓ ఉన్మాది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.  భౌతికదాడులు జరుగుతున్నా కరోనా బాధితులకు వైద్యులు సేవలదింస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి వారికి సంఘీభావంగా దీపం వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిస్తే.. దానిని కూడా మతమౌఢ్యంతో చూడడం ఒవైసీ అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీపం వెలిగిస్తే జ్ఞానం వస్తుందని, రాజకీయపబ్బం కోసం నీతిమాలిన విమర్శలు చేయడం తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ పిలుపును మత కోణంలో చూడడం సమంజసం కాదని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. హిందూ ధర్మం, సంస్కృతిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.


ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారు: జితేందర్‌రెడ్డి

విపత్కర పరిస్థితుల్లోనూ ముస్లింలను తప్పు దోవ పట్టించి సొంతంగా లాభపడాలన్న ఉద్దేశంతో అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రపంచ దేశాలు సైతం భారత సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రధాని మోదీని అభినందిస్తున్న వేళ అసదుద్దీన్‌ అవహేళన చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీర్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2020-04-05T08:44:57+05:30 IST