ఈ 17 రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కేసులు

ABN , First Publish Date - 2020-06-24T00:46:45+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే

ఈ 17 రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలలో ఉన్నట్టు ఘోర పరిస్థితి లేనప్పటికి.. అమెరికాలో ఇప్పటికి కరోనా విజృంభిస్తూనే ఉంది. మరోపక్క అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చేశారు. దీంతో అమెరికాలోని 23 రాష్ట్రాల్లో మరోమారు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కేసులు మరీ ఎక్కువగా ఉన్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కలు చెబుతున్నాయి. కాలిఫోర్నియాలో ఒకపక్క కరోనా కేసులు భారీగా పెరుగుతోంటే.. అక్కడి ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరిచేందుకు కూడా సిద్దమైంది. లాస్ ఏంజెలెస్ కౌంటీలో శనివారం ఒక్కరోజే 2,056 కేసులు నమోదు కాగా.. 48 మంది మరణించారు. మరోపక్క అమెరికాలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా టెక్సాస్‌లోనే సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో అత్యధిక కేసుల జాబితాలో టెక్సాస్ కింద నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకింది. మరోపక్క న్యూయార్క్ నగరంలో సోమవారం నుంచి రెండో విడత సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజా సడలింపులతో ఔట్ డోర్ డైనింగ్, బార్బెక్యూ షాపులు, హెయిర్ సెలూన్స్, ప్లే గ్రౌండ్లు, ఆఫీసులు, రిటైల్ స్టోర్లు కూడా తెరుచుకున్నాయి. ఇదిలా ఉంటే.. అలబామా, అలాస్కా, కనెక్టికట్, ఇల్లినోయి, లూజియానా, మైన్, మేరీల్యాండ్, మశాచూసెట్స్, మిస్సిసిప్పి, న్యూ హ్యాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్, నార్త్ కెరోలినా, పెన్సిల్ వేనియా, రోడ్ ఐల్యాండ్, సౌత్ డకోటా, వెర్మాంట్ రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయి.  

Updated Date - 2020-06-24T00:46:45+05:30 IST