లాక్‌డౌన్ ఎఫెక్ట్: అమాంతం పెరిగిన సైబర్ నేరాలు

ABN , First Publish Date - 2020-04-10T21:32:59+05:30 IST

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: అమాంతం పెరిగిన సైబర్ నేరాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యం కల్పించాయి. సైబర్ నేరగాళ్లకు ఇప్పుడిది వరంగా మారింది. ఇంటి నుంచి పనిచేస్తున్న  ఓ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు జూమ్ యాప్ ద్వారా మేనేజ్‌మెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లోకి వచ్చాడు. మీటింగ్ ప్రారంభమైన కాసేపటికే స్క్రీన్ హ్యాక్ అయింది. స్క్రీన్‌పై అశ్లీల దృశ్యాలు ప్లే అవడం ప్రారంభమైంది. దీంతో మీటింగ్‌లో ఉన్న అందరూ ఒక్కసారిగా కాల్స్ కట్ చేశారు.


కరోనా వైరస్‌పై పోరుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దేశ ప్రజలను కోరారు. ఆయన అలా అన్నారో, లేదో పీఎంకేర్స్ పేరుతో వందలాది ఫేక్ యూఐపీలు పుట్టుకొచ్చాయి. అవి ఫేక్ ఐడీలని తెలుసుకునే లోపే సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు దండుకున్నారు. హోం నెట్‌వర్క్‌లు చాలా బలహీనంగా ఉండడంతో సైబర్ దాడులకు ఇవి ఎక్కువగా గురవుతుంటాయి. మీ సమీపంలో కరోనా వైరస్‌తో బాధపడుతున్నవారి గురించి తెలియజేస్తామని, కోవిడ్-19 హీట్‌మ్యాప్స్ అందిస్తామంటూ డజన్ల కొద్దీ మెసేజ్‌, వెబ్‌సైట్లు వస్తున్నాయి. కొందరైతే నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని మెసేజ్‌లు, లింకులు పంపిస్తున్నారు. వీటిని నమ్మి క్లిక్ చేస్తే ఇక పని అయిపోయినట్టే. ఇలాంటి వన్నీ చివరికి హ్యాకింగ్‌తో ముగుస్తాయి. ఈ లింకులపై క్లిక్ ‌చేయగానే మన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతాయి.  


లాక్‌డౌన్ సందర్భంగా సైబర్ దాడులు, హ్యాకింగ్, ర్యాన్సమ్‌వేర్ కేసులు పెరుగుతున్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసురుతున్నాయి. కార్యాలయాల్లోని నెట్‌వర్క్ పూర్తిగా భద్రంగా ఉంటుంది. కానీ హోం నెట్‌వర్క్‌లకు ఎటువంటి రక్షణ ఉండదు. కాబట్టి హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని న్యాయసంస్థ నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ భాగస్వామి గౌరీ గోఖలే పేర్కొన్నారు.  

Updated Date - 2020-04-10T21:32:59+05:30 IST