తోలుకున్న వారికి తోలుకున్నంత

ABN , First Publish Date - 2022-06-29T04:30:05+05:30 IST

గాలివీడులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తోలుకున్న వారికి తోలుకున్నంత అన్న చందగా రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

తోలుకున్న వారికి తోలుకున్నంత
అరవీడు కుషావతి నదిలో ఇసుక ట్రాక్టర్లు

ఇసుక అక్రమ రవాణా

నదులు, వాగులను వదలని అక్రమార్కులు

పట్టించుకోని అధికారులు

గాలివీడు, జూన్‌ 28: గాలివీడులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తోలుకున్న వారికి తోలుకున్నంత అన్న చందగా రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు ఇసుక అక్రమ రవాణాకు ఓపెన్‌గా పర్మిషన్‌ ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని వాగులు, వంకలు, చెరువులే కాకుండా నదుల నుంచి రోజూ వంద ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గాలివీడులో కొన్ని ప్రాంతాల్లో ఇసుక తోలుకోవడానికి అనుమతులు ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి తోలాలంటే ప్రభుత్వ అనుమతులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించాలి. అలా చేయకుండా కొందరు ఇసుకాసురులు అరవీడు పంచాయతీలోని కుషావతి నది నుంచి, గురుగుపల్లె, తలముడిపి, తూముకుంట పంచాయతీల గుండా వెళుతున్న పాపాఘ్ని నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు సొంతంగా రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు వంకలు, వాగులు, చెరువుల నుంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 


ఓ అధికారి అండతోనే... 

ఇసుక అక్రమ రవాణాకు లక్కిరెడ్డిపల్లెకు చెందిన ఒక అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమార్కుల నుంచి నెలకు 10 వేల నుంచి 30 వేల రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను తోలుకునే ట్రాక్టర్‌ యజమానులు ముందుగా ఆ ఉన్నతాధికారిని సంప్రదించాలి. ట్రాక్టర్‌ యజమానులతో డీల్‌ కుదిరితేనే ఇసుకను తోలుకోవడానికి అనుమతులు వస్తాయని, లేదంటే ఆ ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు చెల్లించిన ట్రాక్టర్లు రాత్రి, పగళ్లు ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా ఇసుకను తోలుకోవచ్చు. ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్‌ యజమానులకు సంబంధించి పూర్తి సమాచారం ఆ అధికారి వద్ద ఉంటుంది. ఎప్పుడైనా రైడ్‌ జరిగితే ట్రాక్టర్‌ను పట్టుకుంటే పలానా వాళ్లది ట్రాక్టర్‌ అని చెప్పగానే వెంటనే వదిలేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇసుక అక్రమ మార్గం ద్వారానే సర్కిల్‌ పరిధిలోని అన్ని మండలాల నుంచి నెలకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా

మండలంలోని ముఖ్యంగా అరవీడు, గోరాన్‌చెరువు, గరుగుపల్లె, తూముకుంట, గాలివీడు గ్రామాలకు చెందిన ట్రాక్టర్‌ యజమానులు ఇసుకను అక్రమ మార్గంలో రాత్రింబవళ్లు తేడా లేకుండా తోలుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు ట్రాక్టర్లను పెట్టుకుని రోజుకు 10 నుంచి 15 లోడులను తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌ రూ.2500 నుంచి 3500 వరకు ధర పలుకుతున్నది. డిమాండును బట్టి రేటును నిర్ణయిస్తారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన దాదాపు 30 ట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. అయితే వీరందరూ లక్కిరెడ్డిపల్లెకు చెందిన ఆ అధికారి దగ్గర ముడుపులు చెల్లించిన వారై ఉండాలి. లేదంటే కన్నెర్ర చేస్తే అందరిపై కేసులు పెట్టి వారి వద్ద నుంచి 30 వేలు వసూలు చేస్తారని ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఒక్క గాలివీడు మండలం నుంచే నెలకు లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చక్రాయపేటతో పాటు సర్కిల్‌లోని ఇతర మండలాల నుంచి కూడా ఇదే విధంగా అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు కలవు. 


ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు

- వినీలత, సీఐ, లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఈబీ 

గాలివీడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇంతవరకు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇసుకను తోలుకోవాలని చెప్పలేదు. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాను. నేను అవినీతికి పాల్పడలేదు. అక్రమంగా తరలిస్తున్న ఎన్నో ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశాను. 



Updated Date - 2022-06-29T04:30:05+05:30 IST