జిల్లాలోనూ మాధవ్‌ను మించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-08-06T05:12:44+05:30 IST

జిల్లాలోనూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మించిన ఎమ్మెల్యే ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్ధుల్‌ అజీజ్‌ అన్నారు.

జిల్లాలోనూ మాధవ్‌ను మించిన ఎమ్మెల్యే
విలేకఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్‌, పక్కన కోటంరెడ్డి

 త్వరలో అకృత్యాలు బయటపెడతాం

టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అజీజ్‌

నెల్లూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోనూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మించిన ఎమ్మెల్యే ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్ధుల్‌ అజీజ్‌ అన్నారు. త్వరలోనే ఆయన అకృత్యాలు, ఆయన చూపించిన వాటిని కూడా బయటపెడతామని ప్రకటించారు. నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి అజీజ్‌ శుక్రవారం నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో మీసం తిప్పి చూపించిన మాధవ్‌కు జగన్మోహన్‌రెడ్డి ఎంపీ సీటు ఇచ్చారని, ఇప్పుడు దుస్తులు ఇప్పి చూపించిన దానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారేమోనని ఎద్దేవా చేశారు. మాధవ్‌ను సస్పెండ్‌ చేసి మహిళాలోకానికి క్షమాప ణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మద్యం షాపుల వేలంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కో షాపునకు రూ.50 లక్షల మామూళ్లు వసూలు  చేశారని ఆరోపించారు. ఆజాదీకాఅమృత్‌ మహోత్సవాల వేళ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డికి ఒక అటెండర్‌ చేత పూలమాల వేయించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, డా.ఉరందూర సురేంద్రబాబు, నరేంద్రరెడ్డి, సాబీర్‌ఖాన్‌, గంగాధర్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

పంచాయితీ చేయడానికి ఎస్‌ఐ ఎవరు?

 ముత్తుకూరులోని ఓ పరిశ్రమలో కరెంటు తీగ తగిలి ఓ లారీ డ్రైవర్‌ మృతిచెందితే పంచాయితీ చేయడానికి ముత్తుకూరు ఎస్‌ఐ శివరామకృష్ణారెడ్డి ఎవరని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్ధుల్‌ అజీజ్‌ ప్రశ్నించారు. నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డ్రైవర్‌ మరణంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తోటి డ్రైవర్లంతా కంపెనీ యాజమాన్యాన్ని అడిగేందుకు వెళుతుంటే ఎస్సై అత్యుత్సాహం చూపారన్నారు. పరిహారం గురించి  తహసీల్దారునో లేక కలెక్టరో కలుగజేసుకోవాలి గానీ పోలీసు లకు ఏం హక్కు ఉందని నిలదీశారు. ఎల్టీ పాలిమర్స్‌ ఘటనలో ఓ మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చారని,  ఇక్కడ డ్రైవర్‌కు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని అజీజ్‌ డిమాండ్‌ చేశారు.  ముత్తుకూరు ఎస్సై బ్రోకర్‌ పనులు మాని పోలీసు పనులు చేయాలని హితవు పలికారు. 


Updated Date - 2022-08-06T05:12:44+05:30 IST