పీఏసీఎస్‌లకు ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే!

ABN , First Publish Date - 2022-08-04T05:05:23+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ప్రస్తుతం కొనసాగుతున్న త్రిసభ్య కమిటీల పదవీ కాలన్నే మళ్లీ ఆరునెలల పాటు పెంచారు.

పీఏసీఎస్‌లకు ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే!


త్రిసభ్య కమిటీల పదవీ కాలం జనవరి వరకూ పొడిగింపు
ఆశావహులకు నిరాశే


ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ప్రస్తుతం కొనసాగుతున్న త్రిసభ్య కమిటీల పదవీ కాలన్నే మళ్లీ ఆరునెలల పాటు పెంచారు. దీంతో ప్రభుత్వానికి పీఏసీఎస్‌ల ఎన్నికలు, జిల్లా కేంద్ర సహకారబ్యాంక్‌ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేనట్లు స్పష్టం అవుతోంది.   రైతులు ఓటు ద్వారా పాలక వర్గాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తిలోదకాలిస్తోంది.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలు అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఇపుడు కమిటీల పదవీ కాలాన్ని పెంచడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలముకున్నాయి. సహకార సంఘ ఎన్నికలను నిర్వహించడం ద్వారా రైతులు తమకు అనుకూలమైన కమిటీని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పదవీ కాలాన్ని పెంచుతూ దొడ్డిదారిన ఎమ్మెల్యేల అనుకూలురుకు సహకరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతో ప్రమేయం లేకుండా పాలకవర్గాల బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తున్నారు.

నాలుగేళ్ల కిందటే..
 రైతులు ప్రత్యక్షంగా ఎన్నుకున్న పాలకవర్గాల పదవీ కాలం 2018లోనే ముగిసింది. అప్పటి నుంచి దొడ్డి దారినే పదవులు కట్టబెడుతున్నారు. 2018లో పదవీ కాలం ముగిసిన సహకార సంఘాలకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) అధ్యక్షుల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పెంచారు. ఎన్నికలు జరిపించలేదు. మళ్లీ మరో ఆరునెలలు పొడిగించారు. ఇలా పెంచుతూవస్తున్న క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యేల ప్రాధమ్యాలు మారుతూ వచ్చాయి. దీంతో తాము సూచించిన వారికి సహకార సంఘాల అధ్యక్షులుగా నియమించాలన్న డిమాండ్‌ పెరిగింది. దీంతో త్రిసభ్య కమిటీల పేరుతో నామినేటెడ్‌ విధానంలో కమిటీల నియామకం చేపట్టారు.

స్వల్ప మార్పులే
కొన్ని పీఏసీఎస్‌ల పరిధిలో మృతి చెందిన సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. భోగాపురం కమిటీ అధ్యక్షుడు గోవిందరావు మృతి చెందటంతో ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అలాగే ఎస్‌.కోట, ఎల్‌.కోట, సీతానగరం, పార్వతీపురం, గరుగుబిల్లి ఇలా కొన్ని చోట్ల సభ్యులు చనిపోవటంతో కొత్త వారికి అవకాశం ఇస్తూ నూతన త్రిసభ్య కమిటీలను ప్రకటించారు. ఎక్కువ చోట్ల సభ్యులు మారారు. ఇలా కొత్తగా జీవో విడుదల చేసి పదవీ కాలం పొడిగించిన కారణంగా ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్నది స్పష్టం అవుతోంది.

కొత్తవారి ఆశలపై నీళ్లు
జిల్లా వ్యాప్తంగా 94 సహకార సంఘాలుండేవి. భోగాపురం మండలం పోలిపల్లి పీఏసీఎస్‌ కొత్తగా ఏర్పాటు కావడంతో ఈ సంఖ్య 95కి చేరింది. ప్రస్తుత పరిస్థితిలో అనేక మంది రాజకీయ నాయకులు పీఏసీఎస్‌ అధ్యక్షులుగా పనిచేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఇటువంటి వారికి ఆశాభంగం కలిగింది. మరో ఆరునెలల పాటు త్రిసభ్య కమిటీలకే అధికారాలు కట్టబెట్టారు.

త్రిసభ్య కమిటీలతోనే కార్యకలాపాలు
ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీల ఆధ్వర్యంలోనే పీఏసీఎస్‌ల కార్యకలాపాలు సాగుతుతాయి. జనవరి నెలాంతం వరకు ప్రస్తుత కమిటీలే పనిచేస్తాయి. 492 జీవో ప్రకారం కొన్ని చోట్ల కమిటీల్లో సభ్యుల మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలోని భోగాపురం, ఎస్‌.కోట, ఎల్‌.కోట, రాజాం, అంటిపేట, బూర్జ, సీతానగరం, బీజే పురం, చినమేరంగి, గరుగుబిల్లి, కురుపాం పీఏసీఎస్‌ల త్రిసభ్య కమిటీల్లో స్వల్ప మార్పులతో జీవో విడుదలైంది. ఈ ఏడాది వ్యవసాయ రుణాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు వంటి కార్యకలాపాలన్నీ త్రిసభ్య కమిటీల పర్యవేక్షణలోనే సాగుతాయి.
                  కె.జనార్ధనరావు, సీఈవో, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌
-------

Updated Date - 2022-08-04T05:05:23+05:30 IST