తొలిడోసు ఇప్పట్లో లేనట్లే!

ABN , First Publish Date - 2021-05-13T05:25:07+05:30 IST

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమపద్ధతిలో సాగడం లేదు. మొదట్లో టీకా వేస్తాం రండీ అంటే ఎవరూ రాలేదు. ఇప్పుడు టీకాకు తీవ్ర కొరత ఉంది. కాస్త ఆగండి అంటే ఎవరూ వినడం లేదు. తెల్లవారే సరికి వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. తొలిడోసు వేసుకున్నవారు నిర్దేశిత గడువు ముగిసేలోగా రెండో డోసు వేసుకోవాల్సి ఉంది.

తొలిడోసు ఇప్పట్లో లేనట్లే!
కొలిగాంలో రెండో డోసు టీకాలు వేస్తున్న సిబ్బంది



 

తొలిడోసు ఇప్పట్లో లేనట్లే!

 రెండో డోసు పూర్తయిన తరువాతే..

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమపద్ధతిలో సాగడం లేదు. మొదట్లో టీకా వేస్తాం రండీ అంటే ఎవరూ రాలేదు. ఇప్పుడు టీకాకు తీవ్ర కొరత ఉంది. కాస్త ఆగండి అంటే ఎవరూ వినడం లేదు. తెల్లవారే సరికి వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. తొలిడోసు వేసుకున్నవారు నిర్దేశిత గడువు ముగిసేలోగా రెండో డోసు వేసుకోవాల్సి ఉంది. ఇటువంటి వారు ఆతృతగా వస్తుండడంతో ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వైరస్‌ బారిన పడుతున్నారు. ఎక్కడ చూసినా టీకా అందడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొన్ని రోజులపాటు తొలిడోసు వ్యాక్సిన్‌ పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని సూచించింది. ఆ మేరకు సాప్ట్‌వేర్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఫోన్లకు మెసేజ్‌లు.. 

వ్యాక్సిన్‌ రద్దీని నియంత్రించడంతో పాటు రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిడోసు టీకా ఇవ్వడం నిలిపివేశారు. రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నవారి సమాచారం వైద్య, ఆరోగ్యశాఖ దగ్గర ఉంది. వారి ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా ఏ కేంద్రానికి ఎన్ని గంటలకు వెళ్లి టీకా వేయించుకోవాలో సూచించనునన్నారు. అవసరాన్ని బట్టి ఫోన్‌చేసి సమాచారం ఇస్తారు. రెండో డోసు మొత్తం పూర్తయిన తరువాతే మొదటి విడత టీకా వేయించుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. అందుకే రిజిస్ట్రేషన్‌ కూడా నిలిపివేశారు. 45 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకుందామని ఓపెన్‌ చేస్తే 2022 జనవరి ఆప్షన్‌ చూపుతోంది.

జిల్లాలో ఇప్పటి వరకు.. 

 జిల్లాకు ఇప్పటి వరకు కొవిషీల్డ్‌ 3,45,250 టీకాలు వస్తే 3,40,000 మందికి మొదటి డోసు వేశారు. కోవాగ్జిన్‌ 66,560 టీకాలు వస్తే అందులో 66 వేల డోసులు వేశారు. మొదటి డోసు కొవిషీల్డ్‌ 2,41,175, కొవాగ్జిన్‌ 39,662 మొత్తం 2,80,8837 డోసులు వేశారు. రెండో డోసు కొవిషీల్డ్‌ 89,386, కొవాగ్జిన్‌ 20,710 మొత్తం 1,10,096 డోసులు బుధవారం వరకూ వేశారు.


ఆందోళన వద్దు 

 రెండు వారాల పాటు తొలిడోసు వేయడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో రెండో విడత టీకా మాత్రం వేస్తాం. వారికి ఆరోగ్య సిబ్బంది నుంచే సమాచారం అందిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ టీకా వేస్తాం. 

- కేసీ చంద్రనాయక్‌, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం.


Updated Date - 2021-05-13T05:25:07+05:30 IST