ఎన్నికలకు వ్యూహకర్తలా.. సిగ్గు..సిగ్గు

ABN , First Publish Date - 2021-07-22T08:29:20+05:30 IST

ఎన్నికల్లో వ్యూహకర్తల సంస్కృతి అభివృద్ధి చెందిన, పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి చాలా దేశాల్లో నేతలు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉంటారు...

ఎన్నికలకు వ్యూహకర్తలా.. సిగ్గు..సిగ్గు

ఎన్నికల్లో వ్యూహకర్తల సంస్కృతి అభివృద్ధి చెందిన, పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి చాలా దేశాల్లో నేతలు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉంటారు. ఎన్నికల వేళ దేశ పరిస్థితి, ప్రజల నాడిని సర్వే చేసి పరిష్కార మార్గాలు సూచించే దిశగా వారి సహాయం తీసుకుంటారు. మన దగ్గర నాయకులంటే నిత్యం ప్రజాసేవలోనే ఉంటారు కాబట్టి జనం చూసి చూసి బోర్‌ కొట్టిన ముఖానికి కొత్త ముసుగు కావాలని వ్యూహకర్తల సాయం కోరుతుంటారు. ఆ కారణంగానే అందరికీ ఇప్పుడు ప్రశాంత కిషోర్‌ అవసరమవుతున్నాడు. పీఠం కోసం నేతలు పీకే చుట్టూ తిరగడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే తలవంపు, భంగపాటు. మూణ్ణెల్ల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో దీదీని గెలిపించిన అదృశ్యహస్తం ప్రశాంత కిషోర్‌ అని తెలియగానే ఆయనకు అడ్వాన్సు బుకింగ్‌లు మొదలయ్యాయి. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ ‘మీ వ్యూహాలన్నీ మాకే చెందాలం’టూ తమ పార్టీలోకి రారమ్మంటోంది. కొత్త సీసాలో పాత సారా మాదిరి హామీలకు కొత్త రూపునిచ్చే నగిషీకారులు ఈ ఎన్నికల వ్యూహకర్తలు. 2014లో బిజెపి గెలుపునకు కావలసిన మసాలా దినుసులు అందించింది ప్రశాంత్‌ కిషోరే. పూర్తిగా నమ్మశక్యం కాని, ఆచరణకు, అమలుకు యోగ్యం కాని ఎన్నికల హామీలు కూడా అప్పుడే పురుడు పోసుకున్నాయనవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గెలిచిన పార్టీలు నెరవేర్చక పోయినా కోర్టులు, ఎన్నికల కమిషన్‌ నిలదీయలేని, అభిశంసించలేని వ్యవస్థ మనది. ఇక వ్యూహకర్తల ఊహాశాలతకు అడ్డేముంది.


విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న దొంగ సొమ్మును తెచ్చి దేశంలోని ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన బహిరంగ ప్రకటన ఇంకా అందరి చెవుల్లో గింగురుమంటూ ఉండచ్చు. ఎన్నికల ప్రచారం చివరి నిమిషం దాకా అవే వాక్యాల్ని సోషల్‌ మీడియా కోడై కూసింది. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ దీనిపై నిలదీస్తే అమిత్‌ షా సమాధానమిస్తూ, ఎన్నికలప్పుడు ఎన్నో మాట్లాడుతాం (జుమ్లా) అని తేలిగ్గా తీసిపారేశారు. ఆ మాత్రం కూడా కేజ్రీవాల్‌కు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఆశలు జల్లి అంతా ఉత్తదే అనడం క్రూర పరిహాసం కదా. అసలు 2014, 2019 ఎన్నికల్లో కలిపి మోదీ వదిలిన మొత్తం ఉత్తిత్తి హామీలు ఎన్నో అమిత్‌ షా ఒక్కసారి బయటపెడితే ప్రజల భ్రమలు కూడా తేలిపోతాయి. నిజానికి ప్రజల శ్రేయస్సు కోరే నేతలకు స్వయంగానే అన్నీ తెలిసి ఉండాలి. సాధ్యమయ్యే మాటలే మాట్లాడాలి. ఎదుటోడి అబద్ధాన్ని నిలదీయాలి తప్ప దాన్ని మించిన అబద్ధం వాడకూడదు. ఎలక్షన్‌ కమిషన్‌ పార్టీల మేనిఫెస్టోలను తెప్పించుకొని సాధ్యాసాధ్యాలు చర్చించి సంతృప్తి చెందిన వాటినే అందులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. వ్యూహకర్తల సలహాలకు వారిని బాధ్యులు చేసేలా కట్టడి ఉండాలి. అలవికాని హామీలు ఇచ్చినందుకు వారిని కోర్టులు ప్రాసిక్యూట్‌ చేయాలి. ఎన్నికల వ్యూహకర్తల వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతున్న సందర్భంగా వారికీ చట్టబద్ధ విధివిధానాల రూపకల్పన అవసరం.  

బి. నర్సన్‌

Updated Date - 2021-07-22T08:29:20+05:30 IST