Maharashtra Cabinet List: సీఎం షిండేకు అస్వస్థత... మంత్రుల జాబితాతో ఢిల్లీకి ఫడ్నవీస్...

ABN , First Publish Date - 2022-08-05T02:30:26+05:30 IST

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 30 నుంచి

Maharashtra Cabinet List: సీఎం షిండేకు అస్వస్థత... మంత్రుల జాబితాతో ఢిల్లీకి ఫడ్నవీస్...

ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 30 నుంచి వాయిదా పడుతున్న ఈ కార్యక్రమం త్వరలో శాసన సభ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో ఇక తప్పనిసరి అయింది. మంత్రివర్గంలో చేరబోయేవారి జాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోద ముద్ర పొందడం కోసం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. 


నూతన మంత్రుల జాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోద ముద్ర వేస్తే, ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగే అవకాశం ఉంది. వైద్యుల సలహా మేరకు ఏక్‌నాథ్ షిండే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని, విశ్రాంతి తీసుకుంటున్నారు. 


ఇదిలావుండగా, మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 43 మందికి అవకాశం ఉంటుంది. అయితే ఆశావహులు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. షిండే, ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రెండు వారాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన తిరుగుబాటులో పాల్గొన్న శివసేన ఎమ్మెల్యేలు, తెర వెనుక ఉంటూ మద్దతు పలికిన బీజేపీ ఎమ్మెల్యేలు తమకు పదవులివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కేవలం మంత్రి పదవులు మాత్రమే కాకుండా కీలక శాఖలు తమకే ఇవ్వాలని ఇరు వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. 


ముఖ్యమంత్రి హోదాలో షిండే కూడా ముఖ్యమైన శాఖలపై కన్ను వేశారు. ఈ విషయంలో తగ్గేదే లేదని దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పట్టుబడుతున్నారు. తనకే ముఖ్యమైన శాఖలివ్వాలని అంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 


శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి జూన్ 30న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 


Updated Date - 2022-08-05T02:30:26+05:30 IST