మత సామరస్యానికి ప్రతీకగా...

ABN , First Publish Date - 2022-08-19T04:34:46+05:30 IST

ఆ గ్రామంలో ఉన్నది అందరూ హిందువులే. ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. సహజంగా పీర్ల పండుగ (మొహరం)ను ముస్లింలు చేస్తుంటారు. కొన్ని గ్రామాలలో హిందూ-ముస్లింలు కలిసి చేసుకుంటారు.

మత సామరస్యానికి ప్రతీకగా...
పీర్ల చావిడి ముందు తవ్విన అగ్నిగుండం

ఒక్క ముస్లిం కూడా లేని గ్రామంలో పీర్ల పండుగ

గూడుపల్లెలో వైభవంగా ప్రారంభమైన ఉత్సవాలు 


ములకలచెరువు, ఆగస్టు 18:  ఆ గ్రామంలో ఉన్నది అందరూ హిందువులే. ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. సహజంగా పీర్ల పండుగ (మొహరం)ను ముస్లింలు చేస్తుంటారు. కొన్ని గ్రామాలలో హిందూ-ముస్లింలు కలిసి చేసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం మత సామరస్యానికి ప్రతికగా హిందువులంతా కలిసి పీర్ల పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ములకలచెరువు మండలం గూడుపల్లెలో 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇది మారుమూల గ్రామం. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. ముస్లిం కుటుంబం ఒక్కటి కూడా లేదు. ఇలాంటి గ్రామంలో హిందువులు అందరూ కలిసి ప్రతి ఏడాది పీర్ల పండుగను వైభవంగా చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా హిందువులే పీర్లను తయారు చేయించారు. పక్కగ్రామమైన దాశెట్టివారిపల్లె నుంచి ముస్లిం మత గురువును పిలిచించి గురువారం నుంచి పీర్ల పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ చావిడిలో పీర్లను ఏర్పాటు చేశారు. హస్సేన్‌హుస్సేన్‌, మస్తాన్‌వలి, బారా ఇమామ్‌, బాదుల్లా సాహెబ్‌, ఫాతీమ, మౌలాలిసాహెబ్‌, షేక్షావలి తదితర పీర్లను ముస్తాబించారు. పీర్లను ఏర్పాటు చేసే సమయంలో గ్రామస్థులంతా చావిడి వద్దకు చేరుకున్నారు. పీర్లను ఏర్పాటు చేసే చావిడి ముందు అగ్నిగుండం తవ్వారు. దాశెట్టివారిపల్లె నుంచి వచ్చిన మత గురువు ఫకృద్దీన్‌ పీర్లను ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో గ్రామంలోని హిందువులు పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శని, ఆదివారం పీర్లను పూలతో అలంకరించి గ్రామంలో ఊరేగిస్తామని గ్రామస్థులు తెలిపారు. ఈనెల 25న జల్ది (పీర్లకు వీడ్కోలు) కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. హిందువులే పీర్లను ఏర్పాటు చేయడం, పీర్ల ముందు ప్రత్యేక ప్రార్థనలు చేయించడం, పీర్లను ఎత్తుకుని గ్రామంలో ఊరేగించడం, అగ్నిగుండం చుట్టూ ఎగరడం విశేషం. ఎక్కడా లేని విధంగా హిందువులే పీర్ల పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పలువురు హిందు, ముస్లింలు అంటున్నారు.

Updated Date - 2022-08-19T04:34:46+05:30 IST